Share News

Hyderabad: ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు..

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:05 AM

స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు. తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు, బలిదానాలతో భారతాన అవతరించిన తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని చాటుకుంటూ.. అగ్రపథాన పయనిస్తూ.. దశాబ్ద కాలాన్ని దాటుతోంది. ఆత్మగౌరవ పోరాటం ఫలించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది.

Hyderabad: ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు..

తూరుపున పొడుస్తున్న ఎర్రనిపొద్దు..

చల్లని చిరుజల్లుల నీలిమేఘం..

పసుపు పుప్పొడుల తంగేడులు..

విచ్చుకున్న పాలపిట్ట రెక్కల జిలుగులు..

మోదంతో విరగబూసిన మోదుగు పూలు..

నిగనిగల గునుగు కొసల మిసమిసలు..

పచ్చని జమ్మి చెట్టు లేలేత చిగుళ్లతో

దశాబ్ది ఉత్సవాల తెలంగాణపై

విరిసి మురిసిన సింగిడి

రాష్ట్రమంతటా సంబురాల సందడి!

  • నేటితో ‘దశాబ్ది తెలంగాణ’.. అవతరణ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

  • అమరవీరుల స్తూపానికి నివాళులతో మొదలు.. ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ

  • సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఫ్లాగ్‌మార్చ్‌.. 650 మంది అమరుల కుటుంబాలకు ఆహ్వానం

  • తొలి, మలిదశ ఉద్యమ భాగస్వాములకూ పిలుపు.. ట్యాంక్‌బండ్‌పై అందెశ్రీ, కీరవాణిలకు సన్మానం

  • నేటితో ఉమ్మడి రాజధానిగా కాలం చెల్లు.. ఇక తెలంగాణ పూర్తి అధీనంలోకి హైదరాబాద్‌

హైదరాబాద్‌/కవాడిగూడ/అడ్డగుట్ట, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన ఉద్విగ్న క్షణాలకు పదేళ్లు. తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు, బలిదానాలతో భారతాన అవతరించిన తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని చాటుకుంటూ.. అగ్రపథాన పయనిస్తూ.. దశాబ్ద కాలాన్ని దాటుతోంది. ఆత్మగౌరవ పోరాటం ఫలించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించింది. గొప్పగొప్ప నాయకులను ఆహ్వానిస్తూ.. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉత్సవ నిర్వహణకు సకల ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించడంతో మొదలు పెట్టి.. 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో పతాకావిష్కరణతో సగర్వంగా, సమున్నతంగా ‘దశాబ్ది తెలంగాణ’ ఆవిష్కృతం కానుంది. రాత్రి బాణసంచాతో వెలుగులు విరజిమ్ముతూ కార్యక్రమం ముగియనుంది.


రోజంతా నిర్వహించే ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను, మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్నవారి కుటుంబాలను ఆహ్వానించింది. తొలి, మలి దశ ఉద్యమాల్లో భాగస్వాములైనవారికీ ఆహ్వానాలు అందాయి. తెలంగాణ కోసం గొంతెత్తిన చుక్కా రామయ్య వంటి వారిని కూడా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఇంటికివెళ్లి ఆహ్వానించారు. ఇలా 650 మంది అమరుల కుటుంబాలను ఉత్సవానికి ఆహ్వానించారు. వీరందరికీ సముచిత స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రం కోసం చోటుచేసుకున్న ప్రాణత్యాగాలను గుర్తు చేసుకోబోతోంది. స్వయం సహాయక బృందాల మహిళలను కూడా ఆహ్వానించి, ఉద్యమంలో మహిళల పాత్రను ప్రభుత్వం వివరించనుంది. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఉత్సవానికి ఆహ్వానించింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించారు. అయితే ఆమె ఆరోగ్యం బాగుంటే రావొచ్చని ఆశిస్తున్నారు. ఒకవేళ రాకపోయినా.. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని పంపించనున్నారని తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్ల కాలం పూర్తి కానున్నందున.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ ఇక పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అధీనంలోకి రానుంది. భవిష్యత్తులో తెలంగాణ రాజధానిగానే ఉండబోతోంది.


అంగరంగ వైభవంగా వేడుకలు..

తెలంగాణ దశాబ్ది వేడుకలకు ట్యాంక్‌బండ్‌ ముస్తాబైంది. 700 మంది కళాకారులతో వివిధ ప్రదర్శనలు, 5వేల మందితో జాతీయ జెండాలను చేత పట్టుకొని ప్లాగ్‌మార్చ్‌, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ లేజర్‌ షో, బాణసంచా కాల్చుతూ సంబరాలు జరగనున్నాయి. వేడుకలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులూ కలగకుండా ట్యాంక్‌బండ్‌ పొడవునా భారీ గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రజలు నిలబడి వేడుకలను తిలకించే విధంగా ప్రత్యేక స్ర్కీన్లను ఏర్పాటుచేశారు. ప్రజలు ఆహారపదార్థాలు, వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు 80 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంచినీటి కొరత లేకుండా వాటర్‌ బోర్డు అధికారులు వాటర్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌, పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు తదితరులు శనివారం పరిశీలించారు.


‘జయ జయహే తెలంగాణ’ గీతంతో ఫ్లాగ్‌మార్చ్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమాచార శాఖ కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. దశాబ్ది వేడుకల వివరాలను శనివారం సచివాలయంలో ఆయన వివరించారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం 9:55 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారని, 20 నిమిషాలపాటు మార్చ్‌పాస్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం (జయ జయహే తెలంగాణ) ఆవిష్కరణ జరుగుతుందని, 10:43 గంటలకు సీఎం ప్రసంగం, అనంతరం అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపారు. కార్యక్రమం మొత్తం 1:35 గంటలపాటు జరుగుతుందన్నారు. సాయంత్రం 6:30 గంటలకు సీఎం ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకుంటారని, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ పూర్తి పాటతో ఫ్లాగ్‌ వాక్‌ జరుగుతుందని వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం జరుగుతుందని, ట్యాంక్‌బండ్‌ వద్ద దాదాపు 2 గంటల పాటు కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై పండుగ వాతావరణం ఉంటుందని, శనివారం సాయంత్రం నుంచే షాపింగ్‌, గేమ్‌ షోలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇక ఆదివారం సాయంత్రం 5 గంటల్లోపే ప్రజలు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోవాలని సూచించారు. వేడుకలకు అందరూ ఆహ్వానితులేనన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 04:05 AM