Hyderabad: ప్రాణాపాయ స్థితిలో భరోసా!
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:11 AM
రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు.. గుండెపోటు వచ్చినప్పుడు.. ఆత్మహత్యాయత్నం జరిగినప్పుడు బాధితులకు తక్షణం వైద్య సాయం అందితే ప్రాణం నిలబడుతుంది! మరి.. ఆ ఆపత్కాలంలో ఎంతమంది వద్ద చికిత్సకు సరిపడా డబ్బులుంటాయి? డబ్బుల్లేక.. ‘గోల్డెన్ అవర్’లో చికిత్స లభించక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

రాష్ట్రంలో ట్రామాకేర్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్న సర్కారు
ఏ ఆస్పత్రిలోనైనా రూ.లక్ష దాకా పూర్తి ఉచితంగా వైద్యం
అధ్యయనానికి తమిళనాడుకు
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు.. గుండెపోటు వచ్చినప్పుడు.. ఆత్మహత్యాయత్నం జరిగినప్పుడు బాధితులకు తక్షణం వైద్య సాయం అందితే ప్రాణం నిలబడుతుంది! మరి.. ఆ ఆపత్కాలంలో ఎంతమంది వద్ద చికిత్సకు సరిపడా డబ్బులుంటాయి? డబ్బుల్లేక.. ‘గోల్డెన్ అవర్’లో చికిత్స లభించక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే సరైన సమయంలో వైద్యసాయం అందించి.. ప్రాణాలు నిలబెట్టడం ద్వారా బాధిత కుటుంబాల్లో ఆనందం నింపేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా ట్రామాకేర్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. బాధితులను దగ్గర్లోని ఆస్పత్రికి వెళితే అక్కడ పైసా అడగకుండా రూ.లక్ష దాకా పూర్తి ఉచితంగా వైద్యం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇది ఇప్పటికే తమిళనాడులో అమల్లో ఉంది. అక్కడి వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ఆరోగ్య శాఖ నుంచి అఽధికారుల బృందాన్ని తమిళనాడుకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాఽధితులకు చికిత్స అందించేలా తమిళనాడు ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. దీని ద్వారా ప్రమాదాలు, గుండెపోటు, ఆత్మహత్యాయత్నం వంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యం కోసం బాధితులకు రూ.లక్ష దాకా ఉచిత చికిత్స అందిస్తున్నారు. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. కాగా అధ్యయనానికి తమిళనాడు వెళ్లిన బృందంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ సహదేవ్ ఉన్నారు.