Share News

CM Revanth: ఆ రెండు పార్టీలకు చుక్కలే.. ఇక నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తా..!

ABN , Publish Date - Mar 17 , 2024 | 03:12 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగిందని.. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏంటో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలకు చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy) హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నాడు జరిగిన "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వాన్ని ప్రయోగించారని అన్నారు.

 CM Revanth: ఆ రెండు పార్టీలకు చుక్కలే.. ఇక నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తా..!

హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగిందని.. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏంటో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలకు చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy) హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నాడు జరిగిన "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వాన్ని ప్రయోగించారని అన్నారు. ఖాసిం రజ్వీ తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసిన వారిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను హరించారని చెప్పారు.

తమ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదే పదే అంటున్నారని చెప్పారు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతుంటే.. చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని పెద్దలు చెప్పారన్నారు. తమ జోలికి వస్తే కొట్టకుండా ఊరుకుంటామా అన్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చింది కాబట్టి.. ఇక నుంచి ఎన్నికల రూపం చూపిస్తామన్నారు. ఈ రోజు నుంచే తానూ రాజకీయం ప్రారంభించానని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పని ప్రారంభించానని తెలిపారు. కాసేపట్లో మీరు పెద్ద వార్త వింటారన్నారు. తమ పార్టీలోకి గేట్లు తెరిచామని.. పొద్దున్నే ఒక గేటు తెరిచా.. మొత్తం గేట్లు ఇంకా తెరవలేదని.. ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకి గేటు ఓపెన్‌ చేశామని అన్నారు.

75 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు పోరాడి మళ్లీ స్వేచ్ఛను తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని అన్నారు. నిజాం విధానాల నకలును కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామని తెలిపారు. 6 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇన్నాళ్లు కవులు, కళాకారులను కేసీఆర్ తన గడీలో బంధించారని ధ్వజమెత్తారు. దొరగారి (కేసీఆర్) భుజకీర్తులను సాగించాలని తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని అన్నారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించామన్నారు. రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించామని తెలిపారు. తాము పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రంతో ఈటల విచారణ చేయించాలి

‘‘మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రంతో విచారణ చేయించాలి. ట్యాపింగ్‌పై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాలి. ఈటల చిల్లర ఆరోపణలు మాని.. విచారణ జరిపించేలా చేయాలి. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది.ఉద్యోగంలో ఉంటే ప్రవీణ్ డీజీపీ అయ్యేవారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రవీణ్‌కు ఆఫర్ చేశా.. కానీ ఆయన ఒప్పుకోలేదు. కేసీఆర్‌ పార్టీలో ప్రవీణ్ చేరుతారని భావించడం లేదు. గులాబీ పార్టీలో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే. కేసీఆర్‌ ఎలాంటి వారి నుంచైనా సగం బలం గుంజుకుంటారు. రైతు భరోసా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5 ఎకరాలు ఉన్న రైతుల వరకూ రైతుబంధు వారి ఖాతాల్లో పడింది. ఇకపై గుట్టలకు, రోడ్లకు, లే ఔట్లకు రైతు భరోసా ఇవ్వబోము. ఏ పథకం అందకపోయినా దరఖాస్తు చేసుకోవాలి. రైతుబంధు అర్హులందరికీ ఇస్తాం. దుబారా తగ్గించడం.. సంపద సృష్టించడమే మా లక్ష్యం. గత సర్కార్‌ అడ్డగోలుగా జీఎస్టీ మినహాయింపులు ఇచ్చింది. కేంద్రం నిధులను సద్వినియోగం చేస్తాం. ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేస్తే విషయాలు బయటపడతాయి. తప్పులకు కారణమైనవారిని వదిలిపెట్టం. జీవోలు దాచి పెట్టే అవసరం లేదు..అన్నీ ప్రజల ముందు ఉంచుతాం. పదేళ్లు అధికారంలో ఉంటామని నేను భావిస్తున్నా. మీరు 20 ఏళ్లు అధికారం ఇస్తామంటే వద్దంటామా. ప్రజలు ఆశీర్వదిస్తే 2050 వరకూ కూడా అధికారంలో ఉంటాం. నాకు వయస్సు ఉంది... ఓపికా ఉంది.మేం విద్యుత్‌ ఇస్తున్నా కొన్ని చోట్ల కోతలు జరుగుతున్నాయి.కొందరు కావాలనే వీఐపీల ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు చేయిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని గంజాయి మొక్కలు ఈ పనులు చేస్తున్నాయి. కేంద్రంతో చిల్లర తగాదాలకు వెళ్లం. పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటిస్తున్నాం. సామాజిక న్యాయం విషయంలో మమ్మల్ని వేలెత్తి చూపలేరు.గత సర్కార్‌ వేల కోట్ల అక్రమాలకు పాల్పడింది. గత సర్కార్‌ అక్రమాలపై విచారణకు ఆదేశించాం. పాదర్శకంగా విచారణ జరుగుతుంది.. బాధ్యులకు శిక్షలు తప్పవు మేం ఫిరాయింపులకు పాల్పడలేదు.

కొండలు, గుట్టలు, లే అవుట్లకు రైతు భరోసా ఇవ్వబోము. నిధుల దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకుంటాం. కొద్దిమంది అవినీతి అధికారులతో సాగించిన కేసీఆర్ పాలనకు స్వస్తి చెప్పాం. పరిపాలన వికేంద్రీకరణ చేసి పారదర్శక పాలన అందించే ప్రయత్నం చేశాం. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 8లక్షల కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేశాం. మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రానా ఆయన పన్నీరు కాదు.. జీరో బిల్‌ను మేం అమలు చేస్తుంటే హరీష్‌రావు అతి తెలివి తేటలు ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు..

అక్రమార్కులను విడిచి పెట్టం

‘‘అక్రమార్కులు ఎంతటి వారైనా విడిచిపెట్టం. తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలను నాటి వెళ్లారు... అవి దుర్గంధం వెదజల్లుతున్నాయి.. అలాంటి గంజాయి మొక్కల్ని మొక్కలను ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం. రోజుకు 18గంటలు పనిచేసి మొత్తం గంజాయి మొక్కల్ని పీకేస్తాం. జీరో బిల్లుతో పేదలకు ఉచిత కరెంటు అందిస్తోంటే.. కొంతమంది అడ్డు తగులుతున్నారు. జీరో బిల్లుతో పేదలకు ఉచిత కరెంటు అందిస్తోంటే.. కొంతమంది అడ్డు తగులుతున్నారు. వాళ్ల అడ్డు తొలగించి పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేసి తీరుతాం. మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంపై రూ.9 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లని.. కానీ ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి రాష్ట్రాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు.. ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంతో, తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళ్తున్నాం. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మీ అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తాం. వైబ్రాంట్ తెలంగాణనే మా లక్ష్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి వేల కోట్లకు చేరింది... చట్టబద్ధంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. బతుకమ్మను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు.. ఎవరు ఉన్నా.. ఎవరు లేకున్నా... బతుకమ్మ, బోనాల పండుగలు ఘనంగా జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్‌ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప.. అవినీతి జరిగిందా లేదా అనే విషయం బయటపడదు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

TG Politics: కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే

BRS: బీఆర్ఎస్‌కు ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్‌బై.. కార‌ణమిదే?

Mallareddy: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని పదేళ్ల క్రితమే జోస్యం చెప్పా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 08:14 PM