Share News

CM Revanth: వర్షాకాలంలో జాగ్రత్త.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - May 26 , 2024 | 05:38 AM

వచ్చే వర్షాకాలంలో రాజధాని నగరం హైదరాబాద్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల సందర్భంగా విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా, ఎక్కడా సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

CM Revanth: వర్షాకాలంలో జాగ్రత్త.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
CM Revanth Reddy

  • నాలాలు క్లియర్‌ చేయండి.. కరెంట్‌ పోవద్దు

  • హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినొద్దు

  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

  • ఒకే గొడుగు కిందకు విపత్తు నిర్వహణ

  • యాక్షన్‌ ప్లాన్‌ 4 లోగా సిద్ధం చేయండి

  • కోడ్‌ ముగియగానే సన్నద్ధతపై తనిఖీలు

  • వర్షాల విపత్తుపై సమీక్షలో సీఎం రేవంత్‌

  • మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి

  • సరఫరా చేయాలంటేనే భయపడాలి..

  • యాంటీ డ్రగ్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయండి

  • కేసుల్లో ఎంతటివారున్నా వదలొద్దని ఆదేశం


హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే వర్షాకాలంలో రాజధాని నగరం హైదరాబాద్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల సందర్భంగా విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా, ఎక్కడా సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించి, హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై వేటు తప్పదని స్పష్టం చేశారు. చొరవతో పనిచేసే వారిని ప్రోత్సహించి, ఉన్నత స్థానాలు కల్పిస్తామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో వానాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకి తెస్తూ విపత్తు నిర్వహ ణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.


ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతాన్ని ఒక యూనిట్‌ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులూ పని చేసేలా ఉండాలన్నారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి విపత్తు నిర్వహణకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జూన్‌ 4 లోగా సంబంధిత ప్రణాళిక సిద్ధం చేయాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. నగరంలోని నాలాల్లో పూడిక తీసే విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, తీసిన పూడికను గుర్తించిన క్వారీ ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఓపెన్‌ సెల్లార్‌ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వాటికి బారికేడింగ్‌ ఉండేలా ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. గతంలో జరిగిన సంఘటనలను పాఠాలుగా తీసుకొని, అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.


వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించాలని చెప్పారు. సమస్యాత్మక నాలాల దగ్గర రోజూ క్లీనింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. తాను కూడా కోడ్‌ ముగియగానే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, వర్షాల విపత్తును ఎదుర్కొనే విషయంలో వివిధ విభాగాల సన్నద్ధతను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా టీజీ న్యాబ్‌ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.


సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయంలో చాలా చురుకుగా పని చేయాలని కోరారు. తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు టీజీ న్యాబ్‌ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ పదం విన్నా, వాటిని సరఫరా చేయాలన్నా భయపడే స్థాయిలో చర్యలుండాలని ముఖ్యమంత్రి చెప్పారు.


రాష్ట్రంలోకి వచ్చే గంజాయి, డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌ను నాశనం చేయాలన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన సమస్త వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని ప్రకటించారు. డ్రగ్స్‌ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా, ఇంకా ఎంత పెద్దవారున్నా ఉపేక్షించవద్దని నార్కొటిక్‌ సహా వివిధ విభాగాల పోలీసులకు చెప్పారు. రేవంత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు రావడం ఇదే ప్రథమం.

Updated Date - May 26 , 2024 | 07:32 AM