Share News

CM Revanth Reddy: పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

ABN , Publish Date - May 16 , 2024 | 02:34 AM

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

CM Revanth Reddy: పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

  • అత్యధిక రుణాలిచ్చే బ్యాంకర్లతో సంప్రదించండి

  • ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయండి

  • ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడండి

  • అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఉక్కుపాదం మోపండి

  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

  • ఏపీతో విభజన సమస్యలను పరిష్కరించుకుందాం

  • ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన సహా

  • పెండింగ్‌ అంశాలన్నింటిపై నివేదిక ఇవ్వండి

  • ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేస్కోండి

  • మంత్రులు, అధికారులతో భేటీలో ముఖ్యమంత్రి

  • 18న కేబినెట్‌ భేటీ నిర్వహించాలని నిర్ణయం

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకువచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని, ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు ఈ నిధుల సమీకరణకు మార్గాలను అధ్యయనం చేయాలని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలనూ రూపొందించాలని ఆదేశించారు. బుధవారం రైతు రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఽధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతుల నుంచి పంటను కొని మిల్లింగ్‌ చేసి రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్‌ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


విభజన సమస్యలను తేల్చేద్దాం..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తికావస్తున్నందున.. ఆంధ్రప్రదేశ్‌తో విభజన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ఉద్యోగుల కేటాయింపు దగ్గర్నుంచి.. ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్‌ అంశాలన్నింటిపైనా నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. విభజన చట్టంలోని షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న కార్పొరేషన్లకు సంబంధించిన ఆస్తులు, అప్పుల పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడం, పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలను పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవనుండటంతో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇక కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. దీంతో ఈ పదేళ్లకుగాను ఏపీకి కేటాయించిన లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌ వంటి భవనాలను జూన్‌ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు.


18న కేబినెట్‌ సమావేశం

ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను ఆ సమావేశంలో చర్చించనున్నారు. వీటితోపాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే వానాకాలం పంటల ప్రణాళికపైనా చర్చించాలని నిర్ణయించారు.

Updated Date - May 16 , 2024 | 05:25 AM