Share News

Lok Sabha Elections 2024: కమలం-హస్తం మధ్య నలిగిపోతున్న 'కారు'.. రిపేర్ అయ్యేదెప్పుడో!

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:48 AM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగో విడతలో తెలంగాణలో 17 లోక్‌సభ(Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తై వంద రోజులు మాత్రమే గడిచాయి. మూడు నెలల కాలంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పులి పిల్లైంది..పిల్లి పులైంది అనే సామెతను గుర్తుచేస్తోంది తెలంగాణ రాజకీయం.

Lok Sabha Elections 2024: కమలం-హస్తం మధ్య నలిగిపోతున్న 'కారు'.. రిపేర్ అయ్యేదెప్పుడో!

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగో విడతలో తెలంగాణలో 17 లోక్‌సభ(Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తై వంద రోజులు మాత్రమే గడిచాయి. మూడు నెలల కాలంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పులి పిల్లైంది..పిల్లి పులైంది అనే సామెతను గుర్తుచేస్తోంది తెలంగాణ రాజకీయం. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్(BRS) బలమైన రాజకీయ శక్తిగా ఉంది. ఆ పార్టీని ఢీకొట్టడమంటే సాధారణమైన విషయంకాదు. ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిందే. కానీ కేవలం మూడు నెలల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధినేత నమ్ముకున్న వ్యక్తులే పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించే వాళ్లంతా.. ప్రస్తుతం ఎప్పుడు పార్టీ వీడి వెళ్లిపోదామా..? అని ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది.

BJP: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

విలవిల.. సేఫ్‌ జోన్‌లోకి!

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఎందుకంటారో తెలంగాణలో పరిస్థితులు చూసి అర్థం చేసుకోవచ్చు.ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో కారు పార్టీ ఇరుక్కుంది. బయటకు ఎలా రావాలో గులాబీ బాస్‌కు అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. ఓ వైపు గత కేసీఆర్ పాలనలో అక్రమాలపై విచారణలు, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్‌తో బీఆర్‌ఎస్ విలవిలలాడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ వ్యవహరించిన తీరు చూసిన తెలంగాణ ప్రజలు ప్రస్తుత పరిస్థితులు చూసి అయ్యో పాపం అనే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ భజన చేసిన నాయకులు.. ప్రస్తుతం ఆ పార్టీని వీడి బీజేపీ, కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ఐదేళ్లపాటు బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం వచ్చే అవకాశం లేదు. ఐదేళ్ల తర్వాత రాజకీయం ఎలా ఉంటుందోనని.. నాయకులంతా సేఫ్ జోన్ కోసం అధికారంలో ఉన్న పార్టీల్లో చేరిపోతున్నారు.

TG News: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

మొదలైన కష్టాలు..

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బీఆర్‌ఎస్‌కు కష్టంగా మారింది. గతంలో బీఆర్‌ఎస్ టికెట్ కోసం పోటీపడే పరిస్థితి నుంచి.. ప్లీజ్ ఎన్నికల్లో పోటీ చేయండనే స్థాయికి చేరుకుంది. కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పార్టీ టికెట్ ఇస్తుందని తెలిసినా.. ఇక్కడ ఉంటే గెలవలేమనే అంచనాతో.. ఎన్నికలకు ముందే బీజేపీ, కాంగ్రెస్‌లో చేరి టికెట్లు తెచ్చుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్ బీజేపీలోకి వెళ్లారు. బీబీ పాటిల్, నగేష్‌కు బీజేపీ ఎంపీ టికెట్లు ఇచ్చింది. రాములు స్థానంలో ఆయన కుమారుడు భరత్ ప్రసాద్‌కు నాగర్ కర్నూలు స్థానాన్ని కేటాయించింది. మరోవైపు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ టికెట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది.

పలుకుబడి కాదు పైసలే..!

ప్రస్తుత రాజకీయాల్లో ప్రజాబలం కంటే ధన బలాన్నే రాజకీయపార్టీలు నమ్ముతున్నాయి. దీంతో ఆర్థికంగా స్థితిమంతులైన వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకుంటోంది. భవిష్యత్తులో పార్టీ కోసం ఖర్చు పెట్టగలరని భావిస్తే పిలిచి కండువా కప్పేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. పవర్ ఉన్న వాళ్ల దగ్గరుంటే.. తమ వ్యాపారాలకు, దందాలకు అడ్డూ అదుపూ ఉండదని భావిస్తున్న నేతలు పార్టీ ఫిరాయించేందుకు వెనుకాడటం లేదు. అధికారం అనే నాలుగు అక్షరాలు ఉంటే చాలు.. మనం ఏం చేసినా చెల్లుతుందనే భావనకు రాజకీయ నాయకులు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా లోక్‌సభ ఎన్నికల ఫైట్ మారింది. బీఆర్‌ఎస్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని.. రెండు నుంచి మూడు స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగినా.. ఎన్ని గెలుస్తుందనే విషయంలో ఆ పార్టీకే స్పష్టత లేనట్లు తెలుస్తోంది.

కవిత అరెస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ బీఆర్ఎస్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టేసినట్లు తెలుస్తోంది. సొంత కుమార్తెను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే కేసీఆర్ స్పందించారు కానీ.. అంత పసలేదనే చెప్పుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోతే.. తెలంగాణలో ఆ పార్టీ మరింత బలహీనడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ను బలహీనర్చడమే టార్గెట్‌గా బీజేపీ పని చేస్తోంది. ఆ పార్టీ ప్లేస్‌ను తాము ఆక్రమిస్తే.. తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చాలనే ప్లాన్‌లో కమలనాధులు ఉన్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే కాంగ్రెస్, బీజేపీ ఫైట్‌లో హస్తం పార్టీని ఓడించడం కమలం పార్టీకి సులువైన పనిగా గత అనుభవాలు చూస్తే అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉన్న రాష్ట్రాలు మినహాయిస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైరెక్ట్‌ ఫైట్ ఉన్న రాష్ట్రాల్లో కాషాయ పార్టీదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో బీఆర్‌ఎస్‌ను ఖతమ్ చేయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

బీఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష..

తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఎంఐఎం.. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచేది. ప్రస్తుతం కారు పార్టీ అధికారంలో లేదు కాబట్టి.. ఈ ఎన్నికల్లో పవర్‌లో ఉన్న కాంగ్రెస్‌కు ఎంఐఎం పరోక్ష మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు కాంగ్రెస్-ఎంఐఎం ఒక్కటే అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తున్నట్లు ప్రకటన చేస్తే.. బీఆర్‌ఎస్‌కు మరింత నష్టం జరిగేట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పొలిటికల్ గేమ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య బీఆర్‌ఎస్ నలిగిపోతుంది. గతంలో ఏ పార్టీకి అయినా తన రాజకీయ చాతుర్యంతో చుక్కులు చూపించేవారు కేసీఆర్. ప్రస్తుతం గులాబీ బాస్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఉన్న క్యాడర్‌ను కాపాడుకోవడమే బీఆర్‌ఎస్ ముందున్న లక్ష్యం. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత.. పార్టీలో మరింత మంది ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే తేలనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 11:48 AM