Share News

Tirumala Darshan: వారానికి 4 సిఫారసు లేఖలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:04 AM

తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.

Tirumala Darshan: వారానికి 4 సిఫారసు లేఖలు

  • తిరుమలలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలకు అనుమతి

  • రెండేసి వీఐపీ బ్రేక్‌, ప్రత్యేక దర్శనాలు

  • ప్రతి దానిపై ఆరుగురికి అనుమతి

  • రేవంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

వికారాబాద్‌ /హైదరాబాద్‌/అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా అనుమతించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాలను కొనసాగించడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమల వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యం, సులభ దర్శనం కల్పించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వారంలో ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ దర్శనం (రూ.500 టికెట్‌) కోసం రెండు లేఖలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్‌) కోసం రెండు లేఖల చొప్పున అనుమతిస్తామని తెలిపారు.


ప్రతి లేఖలో ఆరుగురు వరకు భక్తులను దర్శనానికి సిఫారుసు చేయవచ్చని పేర్కొన్నారు. చంద్రబాబుకు రేవంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు నిర్ణయంపై తెలంగాణ నాయకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం నిర్ణయంతో తెలంగాణ భక్తులకు వేంకటేశ్వరస్వామి దర్శనం మరింత సులభమవుతుందని ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ఇది తెలంగాణ భక్తులకు నూతన సంవత్సర కానుకగా కొండా సురేఖ అభివర్ణించారు. కాగా, సోమవారం అమరావతి సచివాలయంలో చంద్రబాబుతో బీఆర్‌ నాయుడు భేటీ అయి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశంపై చర్చించారు.

Updated Date - Dec 31 , 2024 | 04:04 AM