Share News

Ranji Trophy: 61వ సెంచరీతో చెలరేగిన చటేశ్వర్ పుజారా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా?..

ABN , Publish Date - Jan 07 , 2024 | 08:44 AM

ఫామ్ లేమితో టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపాడు. త్వరలో భారత్, ఇంగ్లండ్‌ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే.

Ranji Trophy: 61వ సెంచరీతో చెలరేగిన చటేశ్వర్ పుజారా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా?..

రాజ్‌కోట్: ఫామ్ లేమితో టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపాడు. త్వరలో భారత్, ఇంగ్లండ్‌ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న పుజారా అందుకు తగ్గట్టుగానే దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా జార్ఖండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 162 బంతుల్లో సెంచరీ అందుకున్న పుజారాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇది 61వది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో టీమిండియా బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(81), సునీల్ గవాస్కర్ (81), రాహుల్ ద్రావిడ్ (68) ముందున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 157 పరుగులతో అజేయంగా పుజారా క్రీజులో ఉన్నాడు. ఇప్పటివరకు మొత్తంగా 239 బంతులు ఎదుర్కొన్న పుజారా ఇన్నింగ్స్‌లో 19 బౌండరీలున్నాయి. ఆదివారం జరగనున్న మూడో రోజు ఆటలో 157 పరుగులను పుజారా డబుల్ సెంచరీగా మలచితే టీమిండియాలో మళ్లీ చోటు దక్కే అవకాశాలున్నాయి.


పుజారా అజేయ సెంచరీతో చెలరేగడంతో మ్యాచ్‌లో సౌరాష్ట పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసింది. క్రీజులో పుజారాతోపాటు ప్రేరక్ మన్కంద్(23) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ హర్విక్ దేశాయి(85), వన్ డౌన్ బ్యాటర్ షెల్డాన్ జాక్సన్(54) కూడా సత్తా చాటారు. ప్రస్తుతం జార్ఖండ్‌పై సౌరాష్ట్ర 264 పరుగుల అధిక్యంలో ఉంది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ జట్టు 142 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర బౌలర్లలో పేసర్ చిరాగ్ జానీ 5 వికెట్లతో చెలరేగాడు. కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, ఆదిత్య జడేజా రెండేసి వికెట్లు తీశారు. కాగా మరో మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ విఫలమయ్యాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన శాంసన్ 35 పరుగులు మాత్రమే చేసి యష్ దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు చేసింది. రింకూ సింగ్ 92 పరుగులతో చెలరేగాడు. ధ‌ృవ్ జురేల్(63) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ గోపాల్(36), జలజ్ సక్సేనా(6) ఉన్నారు. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్‌లో కేరళ జట్టు 82 పరుగులు వెనుకబడి ఉంది.

Updated Date - Jan 07 , 2024 | 08:44 AM