Share News

Ishan Kishan: రీఎంట్రీలో తుస్సుమన్న ఇషాన్ కిషన్

ABN , Publish Date - Feb 27 , 2024 | 09:33 PM

టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ రీఎంట్రీలో విఫలమయ్యాడు. 3 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న కిషన్ డివై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టు తరఫున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ మంగళవారం ఆర్ఎంఎల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

Ishan Kishan: రీఎంట్రీలో తుస్సుమన్న ఇషాన్ కిషన్

టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ రీఎంట్రీలో విఫలమయ్యాడు. 3 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న కిషన్ డివై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జట్టు తరఫున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ మంగళవారం రూట్ మొబైల్ లిమిటెడ్(ఆర్ఎంఎల్) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినప్పటికీ మొత్తంగా 12 బంతులు మాత్రమే ఎదుర్కొని 19 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన కిషన్ రీంఎట్రీలో తుస్సుమనిపించాడు. అయితే వికెట్ కీపింగ్‌లో మాత్రం పర్వాలేదనిపించాడు. ఓ క్యాచ్ పట్టడంతోపాటు ఇద్దరిని స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తోపాటు అతని జట్టు కూడా ఫేలవ ప్రదర్శన చేసింది.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రూట్ లిమిటెడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ఇషాన్ కిషన్ ప్రాతినిధ్యం వహించిన ఆర్బీఐ జట్టు 16.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 103 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇషాన్ కిషన్ జట్టు 89 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. కాగా టీమిండియా తరఫున చివరగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు కూడా ఎంపికయ్యాడు. కానీ మానసిక సమస్యలను కారణంగా చూపి ఆ పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత అప్ఘానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు కూడా దూరంగా ఉంటున్నాడు. రంజీ ట్రోఫిలో ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జైషా ఆదేశించినప్పటికీ పట్టించుకోవడం లేదు. పైగా రంజీ ట్రోఫికి దూరంగా ఉంటూ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. దీంతో కిషన్ తీరుపై ప్రస్తుతం అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 09:33 PM