Share News

IND vs ENG: సెంచరీ తర్వాత అందుకే ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు: గిల్

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:12 PM

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో సెంచరీతో అదరగొట్టిన గిల్ టీమిండియా భారీ ఆధిక్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

IND vs ENG: సెంచరీ తర్వాత అందుకే ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు: గిల్

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో సెంచరీతో అదరగొట్టిన గిల్ టీమిండియా భారీ ఆధిక్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న గిల్ ఈ సెంచరీతో ఫామ్‌లోకి కూడా వచ్చేశాడు. టెస్ట్ కెరీర్‌లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. గిల్ సెంచరీతో సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ 143 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సెంచరీ అనంతరం గిల్ మాట్లాడుతూ తన ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘మూడో నంబర్‌లో పరుగులు చేయడం నాకు చాలా ముఖ్యమైనది. చాలా సంతృప్తినిచ్చింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వికెట్లను త్వరగా కోల్పోయిన స్థితిలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం బాగుంది. ఇంతకుముందు వారు మాకు ఓపెనింగ్‌లో మంచి ఆరంభాలన్నించారు. మేము భారీ అధిక్యాన్ని సాధించేందుకు తాను వీలైనన్నీ ఎక్కువ పరుగులు చేయడం ముఖ్యమని నేను భావించాను. ’’ అని గిల్ చెప్పాడు.


ఇక శ్రేయాస్ అయ్యర్ కారణంగా తాను ఆరంభంలోనే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడి సెంచరీ కొట్టానని గిల్ తెలిపాడు. కాగా 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టామ్ హర్ట్‌లీ వేసిన బంతికి లెగ్ బైస్‌లో ఔట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించాడు. కానీ శ్రేయాస్ అయ్యర్ సలహాతో రివ్యూకు వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది. ‘‘బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుందని నేను మొదట భావించలేదు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం రివ్యూకు వెళ్లమని చెప్పాడు. అంపైర్ కాల్ అయినా పర్వాలేదని చెప్పాడు. దీంతో నేను రివ్యూకు వెళ్లాను. దీంతో నాటౌట్ అని తేలింది. ’’ అని చెప్పాడు. అయితే సెంచరీ పూర్తి చేసిన అనంతరం గిల్ ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు. దీనిపై మాట్లాడుతూ సెంచరీ సాధించడం బాగా అనిపించిందని పేర్కొన్నాడు. అయితే జట్టు కోసం తాను చేయాల్సిన పని ఇంకా అయిపోలేదని భావించినట్టు చెప్పాడు. అందుకే సెంచరీ వేడుకలను కాస్త తక్కువగా జరుపుకున్నట్టు చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 02:12 PM