Share News

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

ABN , Publish Date - Feb 15 , 2024 | 07:35 PM

ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా చెలరేగారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు ఆదుకున్నారు.

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా చెలరేగారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు ఆదుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ-రవీంద్ర జడేజా జోడి చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇంగ్లండ్‌పై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచింది. ఈ క్రమంలో 1985లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నాలుగో వికెట్‌కు మహ్మద్ అజారుద్దీన్-మొహిందర్ అమర్నాథ్ నెలకొల్పిన 190 పరుగుల భాగస్వామ్యం రికార్డును వీరు బ్రేక్ చేశారు. స్వదేశం, విదేశాల్లో కలిపి ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిల జాబితాలో రోహిత్-జడేజా మూడో స్థానంలో నిలిచారు.


2002లో ఇంగ్లండ్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడి నాలుగో వికెట్‌కు 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మొత్తంగా నాలుగో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. 1952లో హెడింగ్లీ వేదికగా జరిగిన టెస్టులో 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విజయ్ మంజ్రేకర్-విజయ్ హజారే జోడి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అలాగే టెస్టుల్లో స్వదేశంలో 1579 రోజుల తర్వాత టీమిండియా ఏ వికెట్‌కైనా 200+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంటే 4 సంవత్సరాల కాలం తర్వాత భారత జట్టుకు మళ్లీ 200+ పరుగుల భాగస్వామ్యం లభించింది. ఈ ఘనత సాధించిన జోడిగా రోహిత్-జడేజా నిలిచారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(110), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. రోహిత్ శర్మ 131, సర్ఫరాజ్ ఖాన్ 62, యశస్వీ జైస్వాల్ 10, రజత్ పటీదార్ 5 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్ల తీయగా.. టామ్ హర్ట్ లీ ఒక వికెట్ తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 07:35 PM