Share News

IND vs ENG: జైస్వాల్ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీ.. మూడో టెస్టుపై పట్టు బిగించిన భారత్

ABN , Publish Date - Feb 17 , 2024 | 05:17 PM

మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కుమ్మేశారు. మెరుపు సెంచరీతో జైస్వాల్ విధ్వంసం సృష్టించగా.. హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగాడు. దీంతో రాజ్‌కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది.

IND vs ENG: జైస్వాల్ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీ.. మూడో టెస్టుపై పట్టు బిగించిన భారత్

రాజ్‌కోట్: మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కుమ్మేశారు. మెరుపు సెంచరీతో జైస్వాల్ విధ్వంసం సృష్టించగా.. హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగాడు. దీంతో రాజ్‌కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో గిల్(65), కుల్దీప్ యాదవ్ (3) ఉన్నారు. 9 ఫోర్లు, 5 సిక్సులతో 133 బంతుల్లోనే 104 పరుగులు చేసిన జైస్వాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీతో చెలరేగిన జైస్వాల్‌కు వెన్నునొప్పి వచ్చింది. దీంతో మైదానాన్ని వీడాడు. అయితే రేపటి వరకు కోలుకుంటే నాలుగో రోజు ఆటలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగే అవకాశాలున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల అధిక్యాన్ని కలుపుకుంటే ప్రస్తుతం ఇంగ్లండ్‌పై టీమిండియా 322 పరుగుల భారీ అధిక్యంలో ఉంది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445, ఇంగ్లండ్ 319 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


126 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు మొదటి ఓవర్‌లోనే 9 పరుగులొచ్చాయి. జేమ్స్ అండర్సన్ వేసిన మొదటి ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. అయితే 19 పరుగులు చేసిన రోహిత్ శర్మను 12వ ఓవర్‌లో రూట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 30 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం శుభ్‌మన్ గిల్‌తో జత కలిసిన యశస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన జైస్వాల్ క్రీజులో కుదురుకున్నాక గేర్ మార్చాడు. అండర్సన్ వేసిన 27వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్సు, రెండు ఫోర్లు బాదాడు. టామ్ హార్ట్‌లీ వేసిన 28వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సులు బాదాడు. ఆ తర్వాత తన కూడా దూకుడును కొనసాగించిన జైస్వాల్ సెంచరీని అందుకున్నాడు.

మొదట 73 బంతుల్లో 35 పరుగులతో ఆడిన జైస్వాల్.. ఆ తర్వాత 122 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. ఈ సిరీస్‌లో జైస్వాల్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. టెస్టు కెరీర్‌లో మూడోది. ఈ క్రమంలో జైస్వాల్, గిల్ భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. అనంతరం శుభ్‌మన్ గిల్ కూడా 4 ఫోర్లు, 2 సిక్సులతో 99 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్‌లో గిల్‌కు ఇది 5వ హాఫ్ సెంచరీ. మంచి ఊపు మీదున్న జైస్వాల్ 44వ ఓవర్ తర్వాత వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్.. టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 51 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంగ్లండ్ ముందు భారత జట్టు భారీ లక్ష్యం ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఓవర్‌నైట్ స్కోర్ 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే భారత బౌలర్లు బుమ్రా, కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టారు. రూట్(18)ను బుమ్రా, బెయిర్‌స్టోతోపాటు కీలకమైన డకెట్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా బెయిర్‌స్టోను డకౌట్ చేసిన కుల్దీప్.. కాసేపటికే భారీ సెంచరీతో చెలరేగుతున్న బెన్ డకెట్ (153)ను కూడా ఔట్ చేశాడు. శుక్రవారం నాటి తన స్కోర్‌కు డకెట్ మరో 18 పరుగులు మాత్రమే జోడించాడు. అయితే వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డకెట్ 23 ఫోర్లు, 2 సిక్సులతో 151 బంతుల్లోనే 153 పరుగులు చేశాడు. దీంతో 260 పరుగులకు ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత స్టోక్స్, ఫోక్స్ వికెట్లకు కాసేపు అడ్డుగా నిలిచారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 65వ ఓవర్లో రవీంద్ర జడేజా విడదీశాడు. 41 పరుగులు చేసిన స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్ చెలరేగాడు. ఆ వెంటనే ఫోక్స్(13)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 299 పరుగుల వద్దే ఇంగ్లండ్ 6, 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఇంగ్లండ్ ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. రెహాన్ అహ్మద్(6), జేమ్స్ అండర్సన్(1)ను సిరాజ్.. టామ్ హార్ట్‌లీ(9)ను జడేజా ఔట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు.. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 126 పరుగుల భారీ అధిక్యం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 05:31 PM