Share News

IND vs AFG: మొదటి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 3 రికార్డులివే!

ABN , Publish Date - Jan 09 , 2024 | 02:02 PM

భారత్, అఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మొహాలీ వేదికగా గురువారం రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత మళ్లీ టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

IND vs AFG: మొదటి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 3 రికార్డులివే!

మొహాలీ: భారత్, అఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మొహాలీ వేదికగా గురువారం రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత మళ్లీ టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ సిరీస్ ద్వారా టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని 3 అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లీ క్రీజులో కుదురుకుంటే మొదటి టీ20 మ్యాచ్‌లోనే ఆ రికార్డులను అందుకోవచ్చు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటిరవకు 11,965 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 374 టీ20 మ్యాచ్‌లాడిన కోహ్లీ 41 సగటుతో 11,965 పరుగులుచేశాడు. స్ట్రైక్ రేటు 133గా ఉంది. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలున్నాయి. దీంతో మరొక 35 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో కోహ్లీ 12 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.


ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా నాలుగో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ రికార్డును కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్ అందుకున్నారు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో కలిపి కోహ్లీ ఇప్పటివరకు 99 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. మరొక 50+ స్కోర్ సాధిస్తే 100 సార్లు ఈ మార్కు చేరుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. మొత్తంగా మూడో ఆటగాడిగా నిలుస్తాడు. కోహ్లీ కంటే ముందే ఈ రికార్డును క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ అందుకున్నారు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8,972 బంతులను ఎదుర్కొన్నాడు. దీంతో మరొక 28 బంతులను ఎదుర్కొంటే 9 వేల బంతులను పూర్తి చేసుకుంటాడు. కాగా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. కోహ్లీ కంటే ముందే ఈ రికార్డును షోయబ్ మాలిక్, క్రిస్ గేల్ అందుకున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 02:02 PM