Share News

IND vs ENG: రికార్డు సృష్టించిన బ్యాటర్లు.. 92 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

ABN , Publish Date - Jan 27 , 2024 | 01:28 PM

ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

IND vs ENG: రికార్డు సృష్టించిన బ్యాటర్లు.. 92 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురు కూడా 80+ చొప్పున పరుగులు చేశారు. ఒకానొక దశలో ముగ్గురూ సెంచరీలు సాధించే లాగే కనిపించారు. కానీ ఒక్కరు కూడా సెంచరీ మార్కు చేరుకోకుండానే ఔట్ అయ్యారు. ధాటిగా ఆడిన యశస్వి జైస్వాల్ 10 ఫోర్లు, 3 సిక్సులతో 74 బంతుల్లో 80 పరుగులు చేశాడు. 123 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 8 ఫోర్లు, 2 సిక్సులతో 86 పరుగులు, 180 బంతులు ఎదుర్కొన్న జడేజా 7 ఫోర్లు, 2 సిక్సులతో 87 పరుగులు చేశాడు. అయితే వీరు ముగ్గురు 80+ స్కోర్‌లో ఔట్ కావడంతో టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. 92 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు 80+ పరుగులు చేసి ఔట్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


కాగా భారత బ్యాటర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 436 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 421/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు ఆ కాసేపటికే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ వరుస ఓవర్లలో మిగతా 3 వికెట్లను సాధించాడు. జో రూట్ ధాటికి 436 పరుగుల స్కోర్ వద్దనే టీమిండియా మిగతా 3 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో జడేజా 87, రాహుల్ 86, జైస్వాల్ 80, అక్షర్ పటేల్ 44, కేఎస్ భరత్ 41, శ్రేయాస్ అయ్యర్ 35, రోహిత్ శర్మ 24, శుభ్‌మన్ గిల్ 23, అశ్విన్ ఒక పరుగు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ రెండేసి వికెట్లు, జాక్ లీచ్ ఒక వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 190 పరుగుల భారీ అధిక్యం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 27 , 2024 | 01:38 PM