Share News

IPL 2024: సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కేకు బిగ్ షాక్.. సగం టోర్నీకి స్టార్ ఓపెనర్ దూరం

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:51 PM

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు సన్నాహాకాలు కూడా మొదలుపెట్టారు.

IPL 2024: సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కేకు బిగ్ షాక్.. సగం టోర్నీకి స్టార్ ఓపెనర్ దూరం

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024( IPL 2024) ప్రారంభంకానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మరోసారి అదరగొట్టాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు సన్నాహాకాలు కూడా మొదలుపెట్టారు. కానీ ఇంతలోనే చెన్నైకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవాన్ కాన్వే(Devon Conway) ఈ సీజన్‌లో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఆడిన టీ20 సిరీస్ సందర్భంగా కాన్వే గాయపడ్డాడు. కాన్వే ఎడమ చేతి బొటన వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతనికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం కాన్వే కోలుకోవడానికి 8 వారాల సమయం పట్టనుంది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ ఒక ప్రకటన విడుదల చేసింది.


‘‘ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఓపెనర్ డేవాన్ కాన్వే ఎడమి చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో ఈ వారం శస్త్ర చికిత్స చేయనున్నారు. అనేక స్కానింగ్‌లు, నిపుణుల సలహాల తర్వాత కాన్వే కోలుకోవడానికి కనీసం 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని తేలింది.’’ అని తెలిపింది. దీంతో కాన్వే మే నెలలోనే మళ్లీ బ్యాట్ పట్టే అవకాశాలున్నాయి. కాగా ఐపీఎల్ 2024 ఈ నెల 22 నుంచే ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక గత సీజన్‌లో చెన్నైసూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో డేవాన్ కాన్వే కీలక పాత్ర పోషించాడు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి అనేక మంచి ఆరంభాలను ఇచ్చాడు. 15 మ్యాచ్‌ల్లో 51 సగటుతో 672 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 139గా ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ 25 బంతుల్లోనే 47 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. కాన్వే లేకపోవడంతో మరో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను చెన్నై తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. మూడో స్థానంలో రహానే ఆడనుండగా నాలుగో స్థానంలో డారిల్ మిచెల్ ఆడొచ్చు. అంబటి రాయుడు రిటైర్మెంట్‌తో మిచెల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మరో చెన్నై ఆటగాడు మొయిన్ అలీ కూడా ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 04:53 PM