Share News

AP Elections: పిఠాపురం ‘పవన్‌’దేనా.. సర్వేలు ఏం చెబుతున్నాయ్..!?

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:46 PM

ఏపీలో ఎన్నికల (AP Elections) వేడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలతో అన్ని పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ(Assembly)తో పాటు లోక్‌స‌భ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో ఎన్నికల బరిలో ఎవరుంటారో అధికార వైసీపీ, కూటమి తరపున టీడీపీ-జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు.

AP Elections: పిఠాపురం ‘పవన్‌’దేనా.. సర్వేలు ఏం చెబుతున్నాయ్..!?
Pawan Kalyan

ఏపీలో ఎన్నికల (AP Elections) వేడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలతో అన్ని పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ(Assembly)తో పాటు లోక్‌స‌భ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో ఎన్నికల బరిలో ఎవరుంటారో అధికార వైసీపీ, కూటమి తరపున టీడీపీ-జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. పార్టీ అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. వైసీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. వీటిలో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా జనసేన అధినేత పవణ్ కల్యాణ్(Pawan Kalyan) పోటీచేస్తున్న పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తున్నారు.

ఆ 91 వేల ఓట్లు ఎటు..?

2019 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన వంగా గీత ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పార్టీ అధినేత, అందులోనూ పొత్తులతో వస్తున్న పవన్ ఇక్కడ్నుంచి పోటీచేస్తుండటంతో.. వంగా గీతలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు 91 వేలు ఉన్న నియోజకవర్గం కావడంతో అటు వైసీపీ నుంచి.. ఇటు జనసేన నుంచి ఇద్దరూ కాపులే పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ.. ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమవైపే ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీకి దింపారు. అయితే.. పవన్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని.. సర్వేలు అన్నీ చేయించిన తర్వాతే పవన్ ఇక్కడ్నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వార్ వన్ సైడ్ అవుతుందని జనసైనికులు గట్టిగానే చెప్పుకుంటున్నారు.

ఇదీ జగన్ ప్లాన్!

కాపుల ఓట్లను చీల్చడం ద్వారా పవన్ గెలుపును అడ్డుకోవచ్చన్నది జగన్ ప్లానట. ఇందులో భాగంగానే కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి చేర్చుకున్నారని స్థానికంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఎంపీగా ఉన్న వంగా గీతను ఇక్కడ్నుంచి పోటీచేయిస్తున్నారు. అయితే.. ఇదే వైసీపీకి పెద్ద మైనస్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల సర్వేల్లో పవన్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారని తేలడంతో.. మార్పులు, చేర్పులు చేసినా ప్రయోజనం లేకపోయిందా..? అని వైసీపీ అధిష్టానం డైలమాలో పడిందట. ఇందుకు ఏకైక కారణం.. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో ఓడిన పవన్‌ను ఈసారి పిఠాపురం నుంచి గెలిపించి చట్టసభల్లోకి పంపాలని కాపులు ఫిక్స్ అయ్యారట. మరోవైపు.. రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనని చెబుతుండటంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎలా ముందుకెళ్తుందో.. సర్వేలే నిజమవుతాయా లేకుంటే ఊహించని రీతిలో ఫలితాలు ఉంటాయా అన్నది తెలియాలంటే జూన్-04 వరకు వేచి చూడాల్సిందే మరి.

Updated Date - Mar 16 , 2024 | 05:24 PM