Share News

AP Elections: కృష్ణా జిల్లాలో 6 సార్లు పసుపుకే పట్టం.. ఈసారి సీన్ మారుతుందా..!?

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:04 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలుండగా జిల్లాల పునర్విభజన తరువాత కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో చెరి పార్లమెంటు, చెరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిగతా రెండు ఏలూరు జిల్లాలో కలిసిపోయాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే పోటీ చేయగా ఈసారి మాత్రం కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈసారి కృష్ణాతీరం ఎవరివైపు మొగ్గుచూపబోతోందన్నది రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అంశం...

AP Elections: కృష్ణా జిల్లాలో 6 సార్లు పసుపుకే పట్టం.. ఈసారి సీన్ మారుతుందా..!?

  • తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత..

  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో 9 సార్లు ఎన్నికలు

  • 6 ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలు

  • ఐదేళ్ల వైసీపీ పాలనతో విసుగెత్తిన కృష్ణా తీరం

  • అభివృద్ధి మరచి బూతులు.. విద్వేషరాజకీయాలతో కాలక్షేపం

విజయవాడ, ఆంధ్రజ్యోతి:

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలుండగా జిల్లాల పునర్విభజన తరువాత కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో చెరి పార్లమెంటు, చెరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిగతా రెండు ఏలూరు జిల్లాలో కలిసిపోయాయి. గత ఎన్నికల్లో (AP Assembly Elections) టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే పోటీ చేయగా ఈసారి మాత్రం కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈసారి కృష్ణాతీరం ఎవరివైపు మొగ్గుచూపబోతోందన్నది రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అంశం.


Chandrababu-Sabha.jpg

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇదీ పరిస్థితి..

విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, వైసీపీ అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ ప్రధా న అభ్యర్థులు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. ఆయన అవినీతి, అక్రమాలత్లో ఈసారి ఆసిఫ్‌ గెలుపు కష్టమేనన్నది స్థానికుల మాట. పశ్చిమ ఆనవాయితీ ప్రకారం ఈసారి వేరే పార్టీ జెండా ఎగరాల్సిందే. ఇక తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్‌, వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాశ్‌ బరిలో ఉన్నారు. వైసీపీ పంచన చేరిన అవినాశ్‌, ఆయన అనుచరగణం విద్వంసాలను గుర్తుపెట్టుకుంటే తూర్పు ఓటర్లు కచ్చితంగా గద్దె వైపు మొగ్గుచూపుతారన్నది విశ్లేషకుల మాట. ఇక సెంట్రల్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమ, వైసీపీ అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ వెలంపల్లికి సిటింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహాయ నిరాకరణ, సొంత పార్టీ కార్పొరేటర్ల ధిక్కారం, పశ్చిమ అవినీతి, తాజాగా గులకరాయి డ్రామా రివర్స్‌ ఇవన్నీ ఆయనపై ప్రభావం చూపేవే. మై లవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్‌, వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతి రావు పోటీలో ఉన్నారు. తిరుపతిరావుది ఎమ్మెల్యే స్థాయి కాదని వార్డు సభ్యుడిగా గెలవలేని వ్యక్తిని కృష్ణప్రసాద్‌ జెడ్పీటీసీగా గెలిపించారని, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా అంగీకరించలేకపోతున్నామని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నా రు. ఇక తిరువూరులో టీడీపీ అభ్యర్థిగా కొలికపూ డి శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా నల్లగట్ల స్వా మిదాసు పోటీలో ఉన్నారు. నల్లగట్ల గతంలో ఎమ్మెల్యేగా చేసిన సమయంలో ఆయన చేసిన అవినీతిని తలచుకుంటేనే ఓటర్లు తిరస్కారభావం తో చూస్తారు. జగ్గయ్యపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రీరాం తాతయ్య, వైసీపీ అభ్యర్థిగా సామినే ని ఉదయభాను పోటీలో ఉన్నారు. ఇక్కడా సామినేనికి అవినీతి శాపంగా మారబోతోంది. నం దిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, వైసీపీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహనరావు పోటీచేస్తున్నారు. మొండితోక బ్రదర్స్‌ అక్రమాలు ఈ ఎన్నికల్లో ముంచబోతున్నాయన్నది స్థానికుల మాట. మొత్తం మీద ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థులకు సానుకూలత కనిపించని పరిస్థితి.


YS-Jagan-Sabha.jpg

కృష్ణా జిల్లాలో..

జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటుతోపాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎంపీ స్థానానికి 10సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్‌, ఒకసారి వైసీపీ గెలుపొందాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తుంటే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ పోటీలో ఉన్నారు. సిటింగ్‌ ఎంపీగా ఉన్న బాలశౌరి చేసిన అభివృద్ధి, ఆయనపై పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవడం కలిసివచ్చే అంశాలు. ఇక ఏడు అసెంబ్లీ స్థానాల్లో అవనిగడ్డ జనసేనకు కేటాయించారు. కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న బుద్ధ ప్రసాద్‌కు ఎలాంటి అ వినీతి మరక లేకపోవడం కలిసి వచ్చే అంశం. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సింహాద్రి రమేశ్‌పై అవినీతి ఆరోపణలతోపాటు అవనిగడ్డను రౌడీరాజ్యానికి అడ్డాగా మార్చారన్న పేరుంది. మచిలీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర, వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు బరిలో ఉన్నారు. ఈ ఐదేళ్లలో తండ్రీకొడుకులు చేసిన అక్రమాలు, అవినీతి మైనస్‌గా మారనున్నాయి. పెడన నుంచి టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్‌, వైసీపీ అ భ్యర్థిగా ఉప్పాల రాము పోటీలో ఉన్నారు. ఉ ప్పాల రాము సతీమణి ప్రస్తుతం జెడ్పీ చైర్మన్‌ గా ఉన్నా నడిపించేదంతా రామునే అని ఆరోపణలున్నాయి. పామర్రు నుంచి టీడీపీ అభ్యర్థిగా వర్లకుమార్‌ రాజా, వైసీపీ అభ్యర్థిగా కైలే అనీల్‌ కుమార్‌ పోటీలో ఉన్నారు. కైలే అనీల్‌పై పెద్దగా వ్యతిరేకత లేకున్నా ఇసుక, గ్రావెల్‌ దోపిడీలో ఆ యన అనుచరుల పాత్రపై ఆరోపణలున్నాయి. ఇక కృష్ణాజిల్లాలో హాట్‌ సీట్స్‌గా పేరొందిన గన్నవరం, గుడివాడ, పెనమలూరుపై రాష్ట్రవ్యాప్తం గా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు. వంశీ, ఆయన అనుచరుల దోపిడీపై ప్ర జల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము, వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఇక్కడా గన్నవరం సీనే రిపీట్‌ కానుంది. నాని బూతుల నానీగా, ఆయన అనుచరులు గడ్డం గ్యాంగ్‌గా పేరొందారు. వీరి ఆగడాలు నాని గెలుపును ప్ర భావితం చేయనున్నాయి. పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బోడె ప్రసాద్‌, వైసీపీ అభ్యర్థిగా జోగి రమేశ్‌ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం పెడన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగిని అక్కడ గెలవలేడన్న కారణంతో పెనమలూరు మార్చారు. అంటే పెడనలో ఏ స్థాయిలో దోచేశారన్నది అర్ధమవుతుంది. ఇన్ని భుజకీర్తులతో గట్టెక్కడం కత్తి మీద సామని జోగి అనుచరులే అంటున్నారు. కృష్ణా జిల్లాలోనూ వైసీపీకి వన్‌సైడ్‌గా విజయాన్ని కట్టబెట్టే నియోజకవర్గాలేవీ లేవంటే అతిశయోక్తి కాదు.

1THREE-PARTIES-LOGO.jpg

తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కృష్ణా జిల్లా పెట్టని కోట. 1982లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు జిల్లావాసులు టీడీపీకే పట్టం కట్టారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ సొంత జిల్లా కావడంతో సహజంగానే ఈ జిల్లావాసులు టీడీపీ పట్ల కాస్త ప్రేమతో ఉంటారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ జెండా ఎగురవేసిన ఘనత జిల్లావాసులది. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ప్రేమ.

Updated Date - Apr 18 , 2024 | 11:14 AM