Share News

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:56 AM

రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.

Modi's sworn : హ్యాట్రిక్‌ ప్రమాణం

వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ.. నెహ్రూ రికార్డుతో సమం

  • రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా కార్యక్రమం

  • మోదీతోపాటు 72 మంది ప్రమాణం

  • 30 మంది క్యాబినెట్‌, ఐదుగురు

  • స్వతంత్ర హోదా, 36 మంది ‘సహాయ’

  • మిత్రపక్షాలకు 11 పదవులు

  • తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, ఏపీ నుంచి

  • రామ్మోహన్‌కు క్యాబినెట్‌ హోదా

  • సహాయమంత్రులుగా బండి సంజయ్‌,

  • పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ

  • రాజ్‌నాథ్‌, షా, నిర్మల తదితరులకు మళ్లీ

  • యూపీకి తొమ్మిది, బిహార్‌కు ఎనిమిది,

  • మహారాష్ట్రకు 6, గుజరాత్‌కు 5 పదవులు

    ఏడుగురు మహిళలకు చాన్స్‌

  • బీసీ 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీ 5

  • గత మంత్రివర్గంలోని 37 మందికి నో

  • 33 మందికి తొలిసారి అవకాశం

  • హాజరైన పొరుగుదేశాల అధినేతలు

  • విపక్షం నుంచి ఖర్గే హాజరు

న్యూఢిల్లీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, తాజా, మాజీ ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలవగానే సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. వేదిక ఎదుట ఆసీనులై ఉన్న వేలాది మందిని ఉద్దేశించి మోదీ గౌరవ వందనం చేసి ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు.


అనంతరం 71 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 60 మంది బీజేపీకి చెందినవారు కాగా 11 మంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన వారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి క్యాబినెట్‌ మంత్రిగా, బండి సంజయ్‌ సహాయమంత్రిగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలుగుదేశం ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కేబినెట్‌ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్‌ సహాయమంత్రిగా, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ సహాయమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురికి మోదీ మూడో మంత్రివర్గంలో స్థానం దక్కినట్లయింది.

  • 30 మంది క్యాబినెట్‌ మంత్రులు

మోదీ కొత్త మంత్రివర్గంలో 30మంది క్యాబినెట్‌ మంత్రులు, అయిదుగురు స్వతంత్ర హోదాలో సహాయమంత్రులు, 36 మంది సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మోదీతో కలిపి కేంద్ర మంత్రివర్గంలో మొత్తం 72 మందికి స్థానం లభించినట్లయ్యింది. కేరళ నుంచి ఎన్నికైన ఏకైక బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేశ్‌గోపీతో పాటు పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న అదే రాష్ట్రానికి చెందిన క్రైస్తవ నేత కురియన్‌కు పార్లమెంటులో సభ్యత్వం లేనప్పటికీ మంత్రిపదవి ఇచ్చారు. పంజాబ్‌లోని లూధియానా నుంచి ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రవీందర్‌ సింగ్‌ బిట్టూకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.

  • వీరికి మళ్లీ అవకాశం

మోదీ గత మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న పలువురికి ఈసారి కూడా పదవి లభించింది. వారిలో బీజేపీకి చెందిన రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, జయశంకర్‌, నిర్మలా సీతారామన్‌, హర్దీప్‌ సింగ్‌పూరి, పీయూష్‌ గోయెల్‌, నితిన్‌ గడ్కరీ, మన్సుఖ్‌ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషి, గజేంద్రసింగ్‌ షెఖావత్‌, భూపేంద్ర యాదవ్‌, జ్యోతిరాదిత్య సింధియా, కిషన్‌రెడ్డి, గిరిరాజ్‌సింగ్‌, అన్నపూర్ణాదేవి, కిరెన్‌ రిజెజు, అర్జున్‌ రాం మేఘ్వాల్‌, శోభా కరంద్లాజే, నిత్యానందరాయ్‌, జితేంద్ర సింగ్‌, రావు ఇంద్రజిత్‌ సింగ్‌, ఎల్‌.మురుగన్‌, వీరేంద్రకుమార్‌, కిషన్‌ పాల్‌ గుజ్జర్‌, ఎస్పీ సింగ్‌ బఘేల్‌ ఉన్నారు. వీరితోపాటు అనుప్రియ పటేల్‌ (అప్నాదళ్‌), రాందాస్‌ అథావలే (రిపబ్లికన్‌ పార్టీ) తదితర మిత్రపక్షాల నేతలకు మళ్లీ మంత్రివర్గంలో అవకాశం లభించింది.


  • ఏడుగురు మాజీ సీఎంలకు చోటు

మోదీ కొత్త మంత్రివర్గంలో ఏడుగురు మాజీ సీఎంలకు చోటు దొరికింది. వారిలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), సర్బానంద సోనోవాల్‌ (అస్సాం), కుమారస్వామి (కర్ణాటక), జితన్‌రాంమాంఝీ (బిహార్‌), రాజ్‌నాథ్‌సింగ్‌ (యూపీ) ఉన్నారు. ప్రధాని మోదీ సైతం గతంలో గుజరాత్‌ సీఎంగా పని చేశారు కాబట్టి, ఆయనను కూడా కలుపుకొంటే మొత్తం ఏడుగురు మాజీ సీఎంలకు చోటు లభించినట్లయ్యింది.

  • యూపీ, బిహార్‌లకు అత్యధికం

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఈసారి దెబ్బతిన్నప్పటికీ ఆ రాష్ట్రానికి 9 మంత్రిపదవులు కేటాయించడం గమనార్హం. బిహార్‌కు కూడా 8 పదవులు కేటాయించారు. మహారాష్ట్రకు 6, గుజరాత్‌కు 5, మధ్యప్రదేశ్‌కు 5, కర్ణాటకకు 5, రాజస్థాన్‌కు 5, ఒడిశాకు 2, ఏపీకి 3, తెలంగాణకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. సామాజిక వర్గాల ప్రకారం చూస్తే 27 మంది బీసీలకు, 10 మంది ఎస్సీలకు, ఐదుగురు ఎస్టీలకు, ఐదుగురు మైనారిటీలకు అవకాశం లభించింది. ఏడుగురు మహిళలకు చోటు దొరికింది. మోదీ మంత్రివర్గంలో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలకు తొలినుంచి విధేయులుగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీలోకి వలస వచ్చిన వారిని మంత్రివర్గంలో చేర్చుకోలేదు.

  • 33 మందికి తొలిసారిగా అవకాశం

కొత్త కేబినెట్‌లో 33 మందికి తొలిసారిగా స్థానం లభించింది. కేంద్ర మంత్రులు అవ్వడం వీరికి ఇదే తొలిసారి. వీరిలో శివరాజ్‌ చౌహాన్‌, మనోహర్‌ ఖట్టర్‌, హెచ్‌డీ కుమారస్వామి, లలన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, జయంత చౌదరి, చిరాగ్‌ పాస్వాన్‌, సురేష్‌ గోపీ, రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బండి సంజయ్‌, శ్రీనివాస వర్మ తదితరులు ఉన్నారు.

  • గత మంత్రివర్గంలోని 37 మందికి దక్కని చాన్స్‌

మోదీ గత ప్రభుత్వంలో మంత్రులు, సహాయ మంత్రులుగా పని చేసిన 37 మందికి నూతన మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వీరిలో స్మృతీ ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌, నారాయణ్‌ రాణే, పురుషోత్తమ్‌ రుపాలా, అర్జున్‌ ముండా, ఆర్కే సింగ్‌, వీకే సింగ్‌ తదితర ప్రముఖులు ఉన్నారు. గత క్యాబినెట్‌లో మంత్రులుగా పని చేసిన వారిలో 18 మంది ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు.


  • పలు దేశాల అధినేతలు

మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు పొరుగు దేశాలైన శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ తోబ్గే, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ విచ్చేశారు.

  • చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీకి, మంత్రులకు ఏపీ ప్రజల తరుఫున టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్‌ భారత్‌ దార్శనీకతకు అంకితమైన మోదీ తన పదవీ కాలాన్ని సంపూర్ణంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి, శ్రేయస్సుకు, కొత్త శకానికి ఎన్డీయే ప్రభుత్వం నాంది పలుకుతుందన్నారు. కాగా, ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పక్కపక్కనే కూర్చున్నారు. అదే వరుసలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. విపక్షం నుంచి ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - Jun 10 , 2024 | 03:56 AM