Share News

Loksabha Polls: మండిలో రాజు వర్సెస్ రాణి

ABN , Publish Date - May 26 , 2024 | 06:07 AM

ఆమె సినిమా ‘క్వీన్‌’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ

 Loksabha Polls: మండిలో రాజు వర్సెస్ రాణి
mandi poll

మండిలో ఆసక్తికరంగా ఎన్నికల సమరం

విక్రమాదిత్యకు ధీటుగా కంగనా

ప్రత్యర్థిపై పదునైన విమర్శలు

కంగనా పొలిటికల్‌ టూరిస్ట్‌ అంటూ విక్రమాదిత్య ప్రచారం

ఆమె సినిమా ‘క్వీన్‌’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ తరఫున పోటీకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి, రాంపూర్‌ రాజవంశానికి చెందిన విక్రమాదిత్యను ఎదుర్కొంటున్నారు. హిమాచల్‌లో ఓ సినీ స్టార్‌ బరిలో దిగడం తొలిసారి. ఇక్కడ మహిళకు బీజేపీ టికెట్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి. విక్రమాదిత్య కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఈయన తండ్రి దివంగత వీరభద్రసింగ్‌ ఆరుసార్లు సీఎంగా పనిచేశారు. మండి నుంచి వీరభద్ర, ఆయన సతీమణి, హెచ్‌పీసీసీ చీఫ్‌ ప్రతిభాసింగ్‌ మూడేసిసార్లు మండి నుంచి విజయం సాధించారు. ప్రతిభా సిటింగ్‌ ఎంపీ కూడా. విక్రమాదిత్య ప్రస్తుతం రాష్ట్ర మంత్రి. విక్రమాదిత్య, కంగనా ఇద్దరూ అఫిడవిట్లలో తమకు రూ.90కోట్లకుపైగా ఆస్తులున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రంలో ఇది ఇద్దరు ధనిక అభ్యర్థుల మధ్య పోటీగా మారింది.


కాంగ్రెస్‌, రాజ వంశీకులకే పట్టం!

రెండు ఉప ఎన్నికలు సహా ఇప్పటివరకు 19సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 13సార్లు నెగ్గింది. అంతేగాక 13సార్లు వివిధ రాజవంశీకులే గెలుపొందారు. కాగా, 17 అసెంబ్లీ స్థానాలతో మండి లోక్‌సభ నియోజకవర్గం ఆరు జిల్లాల్లో విస్తరించింది. ప్రఖ్యాత శీతల విడిది అయిన కులు-మనాలీ ప్రాంతం దీని పరిధిలో దే. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వీటిలోని 12సీట్లను గెలుచుకుంది. 13.77 లక్షలకుపైగా ఓటర్లున్న మండిలో 6.78లక్షల మంది పురుషులు. 6.78లక్షల మంది మహిళలు. కంగనా తన ఇమేజ్‌కు తోడు ప్రధాని మోదీ, అయోధ్య రామ మందిరాన్ని నమ్ముకున్నారు. మహిళల ఓట్లమీద గురిపెట్టారు. విక్రమాదిత్య తమ కుటుంబ సేవలను ప్రస్తావిస్తూ ఓట్లడుగుతున్నారు. కాగా, కంగనాకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌మోర్చా ప్రచారంలోకి దిగింది. అయితే, కులు రాజవంశీకుడు మహేశ్వర్‌ సింగ్‌, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రాం మనవడు ఆశ్రయ్‌ శర్మ, కార్గిల్‌ యుద్ధ వీరుడు బ్రిగేడియర్‌ కుశాల్‌ సింగ్‌ మద్దతు పలికారు.

వ్యక్తిగత విమర్శలతో గరంగరం

‘జూనియర్‌ పప్పు’, ‘దారితప్పిన యువరాజు’, ‘మాట మీద నిలవని వ్యక్తి’ అంటూ విక్రమాదిత్యను కంగనా విమర్శిస్తున్నారు. రూ.250 కోట్ల విలువైన శివ్‌ధన్‌ ప్రాజెక్టును సీఎం సుఖు నిలిపివేసినప్పుడు, మండి వర్సిటీ పరిధిని కుదించినప్పుడు ఎందుకు నోరెత్తలేదని నిలదీస్తున్నారు. తాను గెలిస్తే అన్ని ప్రాంతాలకూ రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తానని హామీ ఇస్తున్నారు. మండిని స్మార్ట్‌ సిటీ చేస్తానంటున్నారు. కంగనా విమర్శలకు విక్రమాదిత్య కూడా దీటుగానే బదులిస్తున్నారు. ఆమె స్థానికేతరురాలన్నారు. నెల రోజుల రాజకీయ పర్యటనకు వచ్చిన కంగనా జూన్‌ 4న ఎన్నికల ఫలితాల అనంతరం బాలీవుడ్‌కు వెళ్లిపోతారని ప్రజలకు వివరిస్తున్నారు. నిరుడు పెను వరదల సమయంలో ఆమె ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. కంగనాను ఓడించి దేవభూమిని పరిశుద్ధం చేయాలని పిలుపునిస్తున్నారు. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - May 26 , 2024 | 08:22 AM