Share News

Delhi: మలి దశ మలుపు ఎవరికో?

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:53 AM

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ శుక్రవారం జరగనుంది. ఓవైపు ఎండలు మండుతున్నప్పటికీ.. ఓటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది

Delhi: మలి దశ మలుపు ఎవరికో?

  • 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌

  • కేరళలోని మొత్తం 20 సీట్లకూ ఓటింగ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కేరళలోని మొత్తం 20 సీట్లు సహా ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. తమిళనాడులో తొలి దశలోనే ఎన్నికల ఘట్టం ముగిసింది.


ఈసారి కేరళ, రాజస్థాన్‌, త్రిపురలో కూడా పూర్తవనుంది. కర్ణాటక (14), రాజస్థాన్‌ (13), యూపీ, మహారాష్ట్ర (8), మధ్యప్రదేశ్‌ (7), అసోం, బిహార్‌ (5), ఛత్తీ్‌సగఢ్‌, పశ్చిమ బెంగాల్‌ (3) స్థానాలకు, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లలోని ఒక్కో సీటుకు మలి దశలో ఎన్నికలు జరుగనున్నాయి.

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (వయనాడ్‌), ఆ పార్టీ కీలక నాయకులు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ (తిరువనంతపురం), కేసీ వేణుగోపాల్‌ (అలప్పుళ), బీజేపీ తరఫున లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (గుంజాల్‌), కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ (జోధ్‌పూర్‌) పోటీలో ఉన్నారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి (మాండ్య), ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ (బెంగళూరు రూరల్‌), ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ భగేల్‌ (రాజ్‌నంద్‌గావ్‌) ప్రజల తీర్పు కోరుతున్నారు.


కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (తిరువనంతపురం), ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత హేమమాలిని (మధుర), విశేష ఆదరణ పొందిన దూరదర్శన్‌ రామాయణ సీరియల్‌ రాముడు పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ (మీరట్‌), బీజేపీ యువ నేత తేజస్వీ సూర్య (బెంగళూరు దక్షిణ)లు రెండో విడతలో ఉన్న ప్రముఖులు. కాగా, 34.80 లక్షల మంది కొత్తవారు సహా 15.88 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఏడు విడతలకు గాను 21 రాష్ట్రాల్లోని 102 సీట్లకు తొలి దశలో భాగంగా ఈ నెల 19న పోలింగ్‌ నిర్వహించారు.

బీజేపీకి గట్టి పోటీ తప్పదా?

రాహుల్‌ గాంధీతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ బరిలో ఓటమి ఎరుగని కేసీ వేణుగోపాల్‌, నాలుగో సారి గెలుపును ఆశిస్తున్న శశిథరూర్‌ వంటి వారి పోటీతో మలి విడతలో కళ్లన్నీ కేరళపైనే ఉన్నాయి. 2.77 కోట్ల మందిపైగా ఓటర్లున్న ఈ రాష్ట్రంలో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, వామపక్షాలు నేరుగా తలపడుతున్నాయి. కాగా, రెండో దశలో కూడా ఇండియా కూటమి నుంచి బీజేపీకి గట్టి పోటీ తప్పదని, ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగే 42 స్థానాలలో అత్యధిక స్థానాలు ‘ఇండియా’కే వస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


బిహార్‌లోని కిషన్‌గంజ్‌, పూర్ణియా, భగల్ఫూర్‌, కతిహార్‌లో ఎన్డీఏకు గట్టి పోటీ నెలకొంది. యూపీలోని 8 సీట్లలో ఎన్డీఏ, ఇండియా కూటములతో పాటు బీఎ్‌ససీ కూడా రంగంలోకి దిగడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశాలు లేవని, రాజస్థాన్‌లో కూడా గతంలోలా 25కు 24 సీట్లు గెలుచుకునే అవకాశాల్లేవని అంచనాలు వెలువడుతున్నాయి.

Updated Date - Apr 26 , 2024 | 04:53 AM