Share News

Delhi: మోదీ, రాహుల్‌ పేర్లు లేకుండా..బీజేపీ, కాంగ్రెస్‌కు ఈసీ నోటీసులు

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:03 AM

‘‘కాంగ్రెస్‌ వస్తే.. సంపదను దోచుకుని ముస్లింలకు పంచుతుంది. మహిళల మెడల్లోని మంగళ సూత్రాలను కూడా వదలరు’’ అంటూ ప్రధాని మోదీ..

Delhi: మోదీ, రాహుల్‌ పేర్లు లేకుండా..బీజేపీ, కాంగ్రెస్‌కు ఈసీ నోటీసులు

  • స్టార్‌ క్యాంపెయినర్లని పేర్కొన్న కమిషన్‌

  • కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు

  • స్పందించడానికి నిరాకరించిన ఈసీ

  • స్టార్‌ క్యాంపెయినర్లంటూ పేర్కొన్న ఈసీ

  • కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు..

  • స్పందించడానికి నిరాకరించిన ఈసీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘తమిళులు తమిళం మాట్లాడొద్దు.. కేరళీయులు మళయాలం మాట్లాడొద్దు.. ఇదే బీజేపీ నైజం’’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం స్పందించింది.


ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షుడు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసుల్లో ఎక్కడా మోదీ, రాహుల్‌ పేర్లను ప్రస్తావించలేదు. రాజస్థాన్‌లో మోదీ వ్యాఖ్యలపై ఈ నెల 21న కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా.. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కేరళలోని కోటాయంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 19న బీజేపీ నేత ఓం పాఠక్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీఐ.. ఇరు పార్టీల చీఫ్‌లకు నోటీసులు ఇచ్చింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 77 ప్రకారం నోటీసులను జారీ చేసినట్లు పేర్కొన్న ఈసీఐ.. ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటల లోపు సమాధానాలివ్వాలని ఆదేశించింది. నోటీసుల్లో మోదీ, రాహుల్‌ పేర్లను ఎక్కడా ప్రస్తావించకుండా.. ‘సార్‌ క్యాంపెయినర్లు’ నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. హుందాగా ప్రచారం చేయాల్సిన స్టార్‌ క్యాంపెయినర్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే.. పరిస్థితి జటిలంగా మారుతోందని తెలిపింది. మోదీ, రాహుల్‌ పేర్లతో కాకుండా.. పార్టీ అధ్యక్షులకు నోటీసులు ఇవ్వడంపై ఈసీఐ విమర్శలను ఎదుర్కొంటోంది.


ఈ చర్యపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈసీఐ వైఖరి అనుమానాలను లేవనెత్తుతున్నాయని చెబుతున్నారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీకి నేరుగా నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాహుల్‌ తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ పాలనపై తప్పుడు ప్రచారం, దళితుడైనందునే తనను అయోధ్య ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదులను ఒకే విధంగా పరిగణిస్తూ నోటీసులు ఇవ్వడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వారికి అలా.. వీరికి ఇలా..!

నిజానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌-77 స్టార్‌ క్యాంపెయినర్లకు ఉండే వెసులుబాట్లను గురించి వివరిస్తోంది. ఇటీవల తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు విషయంలో ఆయనకు ఇదే సెక్షన్‌ కింద నేరుగా నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రినాటె, పశ్చిమ బెంగాల్‌ బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌, ఆఆప్‌ మంత్రి ఆతిశి, కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా విషయంలోనూ వారికే నేరుగా నోటీసులు ఇచ్చింది.


ఈ నేపథ్యంలో మోదీ, రాహుల్‌ విషయంలో ఆ పార్టీల అధ్యక్షులకు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. సంపదను దోచిపెడతారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ఈసీని పదేపదే ప్రశ్నించినా.. సమాధానాన్ని దాటవేయడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 04:03 AM