Share News

Delhi : రాష్ట్రాల స్థాయిలో నదుల గ్రిడ్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:10 AM

జల వనరుల సమర్థ వినియోగానికి నీతి ఆయోగ్‌ వేదికగా ప్రధాని మోదీ అత్యంత కీలక సూచన చేశారు. ప్రతి రాష్ట్రం వారి స్థాయిలో నదుల గ్రిడ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు.

Delhi : రాష్ట్రాల స్థాయిలో నదుల గ్రిడ్‌

  • జల వనరుల సమర్థ వినియోగానికి ఏర్పాటు చేయాలి

  • విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడండి!

  • రాష్ట్రాల సహకారంతోనే 2047 నాటికి వికసిత్‌ భారత్‌

  • నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): జల వనరుల సమర్థ వినియోగానికి నీతి ఆయోగ్‌ వేదికగా ప్రధాని మోదీ అత్యంత కీలక సూచన చేశారు. ప్రతి రాష్ట్రం వారి స్థాయిలో నదుల గ్రిడ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. నదీ జలాలపై దేశంలోని పలు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయి వివాదాలున్న నేపథ్యంలో ప్రధాని ఈ సూచన చేయడం గమనార్హం. శనివారం రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన 9వ నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రతి భారతీయుడూ కలలు కంటున్నాడని, ఇందులో రాష్ట్రాలు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని.. సహకార సమాఖ్య విధానం ద్వారా 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పారు. శాంతిభద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు దీనికి అత్యంత కీలకమని వివరించారు. దేశంలో పేదరికం నిర్మూలనకు ప్రధాని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి ఇదే ప్రాతిపదిక కావాలని.. దీనిని ఓ కార్యక్రమంలా కాకుండా వ్యక్తి కేంద్రంగా చేపడదామని రాష్ట్రాలను కోరారు. పేదరికాన్ని తగ్గించడం కాదు, పేదరికమే లేని దేశంగా మారేలా కృషి చేయాలన్నారు. కింది స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించినపుడే దేశంలో గొప్ప పరివర్తన జరుగుతుందని వ్యాఖ్యానించారు.


అవకాశాలకు తగ్గట్లు విధానాలు

వివిధ రంగాల్లో ఏర్పడిన అవకాశాలను ఉపయోగించుకుని వినూత్న విధానాలను రూపొందించాలని మోదీ కోరారు. వాటిని అమలుచేసేలా కూడా చూడాలని అన్నారు. జనాభా నిర్వహణ ప్రణాళికలను రూపొందించాలని కోరారు. వృద్దుల సంఖ్య పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని పెంచాలని, ఇందుకోసం సామర్థ్య నిర్మాణ కమిషన్‌తో కలిసి పనిచేయాలని రాష్ట్రాలకు నిర్దేశించారు.

దేశం నిపుణులైన మానవ వనరుల కోసం ఎదురు చూస్తోందన్నారు. ‘‘వ్యవసాయంలో ఉత్పాదకత పెరగాలి. రైతులకు మార్కెట్‌తో అనుసంధానం కల్పించాలి. తక్కువ వ్యయంతో వెంటనే ఫలితాలు సాధించేలా చూడాలి. నేల సారం పెరిగే సహజ పద్ధతులను పాటించాలి. పంట ఉత్పత్తులకు గ్లోబల్‌ మార్కెట్‌ లభించేలా చూడాలి’’ అని కోరారు.

పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించాలి

పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్రాలను కోరిన ప్రధాని.. అవసరమైన విధానాన్ని రూపొందించాలని నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. ఇందులో పెట్టుబడులకు అవసరమైన ప్రణాళికలు ఉండాలని నిర్దేశించారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ఆకాంక్షపూరిత జిల్లాల కార్యక్రమాన్ని మోదీ ప్రశంసించారు.

జిల్లాల మధ్య మెరుగైన పనితీరు కోసం పోటీ ఏర్పడేందుకు వీలుగా నిరంతరం ఆన్‌లైన్‌ పర్యవేక్షణతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. గత పదేళ్లుగా భారత దేశం స్థిరంగా అభివృద్ది చెందుతోందని, పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం, ప్రజలు సమష్టిగా పనిచేసి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేయాలని లక్ష్యం పెట్టుకున్నారని చెప్పారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి 26 రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని రాష్ట్రాలు తమ వ్యూహాలను సమర్పించాయి. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అసెంబ్లీ సమావేశాల కారణంగా నీతి ఆయోగ్‌ భేటీకి హాజరుకాలేదు.

Updated Date - Jul 28 , 2024 | 03:10 AM