Share News

Sandeshkhali Case: షాజహాన్ అరెస్టుపై స్టే లేదు : కలకత్తా హైకోర్టు కీలక ప్రకటన..

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:19 PM

పశ్చిమ్ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.

Sandeshkhali Case: షాజహాన్ అరెస్టుపై స్టే లేదు : కలకత్తా హైకోర్టు కీలక ప్రకటన..

పశ్చిమ్ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ్ బెంగాల్ లోని ఉత్తర నార్త్ 24 పరగణాలు జిల్లాలో ఉన్న సందేశ్‌ఖలిలో తమపై టీఎంసీ నేత లైంగిక దాడికి పాల్పడ్డారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. మమతా ప్రభుత్వ తీరుపై బీజేపీ మండిపడింది. సొంత పార్టీ నేతపై చర్యలు తీసుకునేందుకు టీఎంసీ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని మండిపడింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేషన్ కుంభకోణంలో తన ఇంటిని సోదా చేసేందుకు గ్రామానికి వెళ్లిన ఈడీ అధికారులపై జనవరి 5న దాడి జరిగినప్పటి నుంచి షాజహాన్ పరారీలో ఉన్నారు.

ఈ క్రమంలో షాజహాన్ తో పాటు అతని ఇద్దరు సహాయకులు శిబ్‌ప్రసాద్ హజారా, ఉత్తమ్ సర్దార్‌లను అరెస్టు చేయాలంటూ బాధితులు కర్రలు, వ్యవసాయ పనిముట్లు, చీపుర్లతో నిరసనలు చేశారు. దీంతో షాజహాన్ మినహా మిగతా ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేయడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. మమతా బెనర్జీ ప్రభుత్వం షాజహాన్‌కు రక్షణగా ఉందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళలు రోడ్డెక్కి నినాదాలు చేశారు. ఈ పరిస్థితిపై స్పందించిన టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ.. షాజహాన్‌ను రక్షించే ఆరోపణలను ఖండించారు. అతను పోలీసుల అదుపులోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 02:19 PM