Share News

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:35 PM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నంబర్‌ 1 పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ నేత ప్రశాంత్‌ కిషోర్‌ అంచనా వేశారు.

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నంబర్‌ 1 పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ నేత ప్రశాంత్‌ కిషోర్‌ అంచనా వేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కిషోర్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో దీదీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

బీజేపీ.. దక్షిణ, తూర్పు భారత్‌లో ఉనికి చాటుకోవడానికి ఏళ్లుగా కృషి చేస్తోందని.. అయితే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు ప్రాంతాల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో బీజేపీ ఒకటి లేదా రెండో స్థానంలో నిలుస్తుందన్నారు. 2021 బెంగాల్ ఎన్నికల్లో కిషోర్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) వ్యూహకర్తగా ఉన్నారు. తద్వారా ఆమె ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బెంగాల్‌లో 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాలకుగానూ 18 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. తృణమూల్ 22 స్థానాల్లో గెలుపొందింది.


అయితే 2021 రాష్ట్ర ఎన్నికలలో తృణమూల్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మధ్య కాలంలో బెంగాల్ లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ వివాదం టీఎంసీని ఇరుకున పెట్టింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. దీంతోపాటు టీఎంసీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటంతో సాధారణంగా ప్రజా వ్యతిరేకత ఉంటుందని.. అది తమకు అనుకూలిస్తుందని భావిస్తోంది. ఈ సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి.

ఈసారి బీజేపీకి 300కు పైగా

వివిధ రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి...

బీజేపీకి బాగా పట్టున్న పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లోని కనీసం 100 సీట్లలో ఆ పార్టీని విపక్షాలు.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఓడించగలిగితేనే కమలనాథులకు ఆ సెగ తాకుతుందని.. కానీ, అలా జరిగే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ‘‘మీరు (రాహుల్‌/సోనియా) పోరాడాల్సింది ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో. కానీ, మీరు పర్యటిస్తున్నది మణిపూర్‌, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో. ఇలా అయితే గెలుస్తారు? కేరళలో గెలిస్తే దేశమంతా గెలిచినట్టు కాదు. మీరు యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో గెలవనప్పుడు.. ఒక్క వయనాడ్‌లో గెలవడం వల్ల ఉపయోగమేమీ ఉండదు. అమేఠీని వదులుకోవడం ఒక తప్పుడు సందేశాన్ని పంపుతుంది’’ అని పీకే వ్యాఖ్యానించారు.


బీజేపీని ఎదుర్కొనే నాయకత్వం, ఎజెండా కూటమికి లేవని.. అందుకే బీజేపీ పదేపదే గెలుస్తోందని విశ్లేషించారు. మోదీ నేతృత్వంలో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోందన్న వాదనను ఒక పెద్ద భ్రమగా కొట్టిపారేశారు.

2014 తర్వాత.. అధికారపార్టీ వెనకబడ్డ సందర్భాల్లో విపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్‌ పార్టీ ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో విఫలమైనట్టు ఆయన పేర్కొన్నారు. మోదీ మూడోసారి గెలిచిన తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకుంటానని ప్రకటించారని.. ఆయనేమి చేస్తారో అన్న ఆసక్తి ఒక రాజకీయ పరిశీలకుడుగా తనకున్నదని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 01:39 PM