Share News

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం విచారణ

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:43 AM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారించనుంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 5 సార్లు సమన్లు ఇచ్చినా లెక్క చేయలేదని పేర్కొన్నారు. ఆ కేసులో ఈ రోజు కేజ్రీవాల్ కోర్టుకు రావాల్సి ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం విచారణ

ఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ రోజు (శనివారం) కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. లిక్కర్ పాలసీకి సంబంధించి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఐదుసార్లు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. కావాలనే అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విచారణకు హాజరు కావడంలో లేదని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు (ED Officials) పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో శనివారం (ఈ రోజు) రౌస్ అవెన్యూ కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉంది.

‘విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావాలనే హాజరు కావడం లేదు. సమన్లను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. సమాజంలో గౌరవం కలిగిన వ్యక్తి చట్టాన్ని గౌరవించడం లేదు. లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ప్రవర్తన సరికాదు. అతని తీరు ఇతరులకు ఆదర్శంగా మారే ప్రమాదం ఉంది అని’ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత హాజరు నుంచి సడలింపు ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును ఆశ్రయించారు.

‘ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ క్రమంలో కోర్టుకు స్వయంగా కేజ్రీవాల్ హాజరవడం వీలుకాదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి అని’ కోర్టును కేజ్రీవాల్ తరఫు లాయర్లు కోరారు. అందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అంగీకరించింది. తదుపరి విచారణ జరిగే మార్చి 16వ తేదీన మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 11:04 AM