Share News

లెక్కింపులో అవకతవకలకు కుట్ర

ABN , Publish Date - May 27 , 2024 | 03:58 AM

ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి, తద్వారా ప్రజాతీర్పును మార్చే యత్నాల్లో అధికార పార్టీ బీజేపీ ఉన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని 120కిపైగా పౌరసంస్థలు తీవ్ర ఆరోపణ చేశాయి.

లెక్కింపులో అవకతవకలకు కుట్ర

  • బీజేపీ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం

  • ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్‌ చేయించండి

  • 543 స్థానాల్లో రిటర్నింగ్‌ ఆఫీసర్లకు 120 పౌరసంస్థల లేఖ

న్యూఢిల్లీ, మే 26: ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడి, తద్వారా ప్రజాతీర్పును మార్చే యత్నాల్లో అధికార పార్టీ బీజేపీ ఉన్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని 120కిపైగా పౌరసంస్థలు తీవ్ర ఆరోపణ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను కాపాడాలని దేశంలోని 543 స్థానాల్లోని రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్‌ఓలకు) పిలుపునిచ్చాయి.

ఎన్నికల సంఘం తటస్థత, సచ్ఛీలతపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా చేపట్టాలని ఆర్‌ఓలను, ఎన్నికల పరిశీలకులను కోరాయి. ఈ నెల 21న బెంగళూరులో ఈ సంస్థలు సమావేశమయ్యాయి. పరకాల ప్రభాకర్‌, తీస్తా సెతల్వాడ్‌, మాజీ ఐఏఎస్‌ ఎంజీ దేవసహాయం, రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ ఓంభత్కరే, క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ రిటైర్డ్‌ జాయింట్‌ సెక్రటరీ రవిజోషి, ఫ్రాంకో థామస్‌, నూర్‌ శ్రీధర్‌ తదితరులు ఈ సంస్థల తరఫున ప్రాతినిధ్యం వహించారు.

ఈ భేటీకి ఇండియా కూటమికి చెందిన కొన్ని ప్రతిపక్షపార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఆర్‌ఓలకు పిలుపునిస్తూ ఒక లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆర్‌ఓలకు పౌరసంస్థలు రాసిన లేఖలో..


ఎన్నికల కోడ్‌ను అధికారపార్టీ (బీజేపీ) నేతలు ఉల్లంఘిస్తున్నా కూడా ఈసీ వారిపై చర్యలు తీసుకోవటం లేదని, దీనిద్వారా ఈసీ తటస్థంగా లేదని అర్థమవుతోందని ఆరోపించాయి. ఎన్నికల ప్రక్రియలోని తటస్థతను కాపాడాలంటూ పలు సూచనలు చేశాయి.

‘‘పోలింగ్‌బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలు నమోదయ్యే ఫాం 17సీ ప్రతీ అభ్యర్థి వద్దా ఉండేలా చూడాలి. ఫాం 17సీలోని వివరాలను సరిపోల్చే ఫాం బీ కూడా అభ్యర్థులకు జారీ చేయాలి. మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థుల సమక్షంలో జరిగేలా చూడాలి. వీడియో రికార్డింగ్‌ జరిపించాలి. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తొందరపాటు పనికిరాదు. అవసరమైనప్పుడు ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి’’ అని పేర్కొన్నాయి.

Updated Date - May 27 , 2024 | 04:04 AM