Share News

AP Election 2024: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనడానికి ఇదే బెస్ట్ సీన్!

ABN , Publish Date - Apr 25 , 2024 | 07:40 PM

ఒకాయన ఏకంగా 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు.. ఇంకోకాయన దాదాపు నాలుగేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా, స్పీకర్‌గా విశేష సేవలు అందించిన రాజకీయ దిట్ట.. వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ ఒకానొకప్పుడు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకున్నారు. ‘నువ్వా-నేనా’ అంటూ సవాళ్లు విసుకున్నారు. ఎన్నో అవినీతి ఆరోపణలు గుప్పించుకున్నారు. కానీ కాలం గిర్రున తిరిగింది.

AP Election 2024: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనడానికి ఇదే బెస్ట్ సీన్!

ఒకాయన ఏకంగా 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు.. ఇంకోకాయన దాదాపు నాలుగేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా, స్పీకర్‌గా విశేష సేవలు అందించిన రాజకీయ దిట్ట.. వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ ఒకానొకప్పుడు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకున్నారు. ‘నువ్వా-నేనా’ అంటూ సవాళ్లు విసురుకున్నారు. పరస్పరం ఎన్నో అవినీతి ఆరోపణలు గుప్పించుకున్నారు. కానీ కాలం గిర్రున తిరిగింది. ‘రాజకీయాల్లో శాశ్వత శతృవులు-శాశ్వత మిత్రులు ఉండరు’ అనే నానుడికి అతికినట్టు అనిపించేలా వారిద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై కలిశారు. మమ్మల్ని గెలిపించండి అంటూ జంటగా కోరారు. వారే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు- బీజేపీ నేత నళ్లారి కిరణ్ కుమార్ రెడ్డి.


రాజకీయాల్లో అప్పుడప్పుడూ అపూర్వ కలయికలు జరుగుతుంటాయి. అలాంటిదే నేడు (గురువారం) రాజంపేటలో జరిగింది. శతాబ్దాలపాటు వైరి పక్షాల్లో ఉండి పోరాడుకున్న నారా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో ఒకే రాజకీయ వేదికను పంచుకోవడం రాజకీయవర్గాలను ఆకర్షించింది. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా రాజంపేట నియోజకవర్గం బరిలో నిలిచారు. కూటమి ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ రాజంపేటలో గురువారం ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముగ్గురూ ఒకే వేదికగా పంచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

Untitled-9.jpg


సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం చాలాకాలంపాటు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అయితే తెలంగాణ ఎన్నికలు-2023 సమయంలో ఆయన బీజేపీలో చేరారు. కాగా బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. ఆ విధంగా అనూహ్య రీతిలో ఒకప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు ఇప్పుడు ఒకే వేదికగా పంచుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబును ఎదుర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి.. నేడు చంద్రబాబుతో కలిసి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కుంటుండడం ఆసక్తిదాయకమని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 09:46 PM