Share News

Praja Galam: జగన్.. పోలీసులు ఎక్కడ..!?

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:01 AM

ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటికి వస్తున్నారంటేనే... కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ను ఆపేస్తారు! జగన్‌ రాజకీయ సభలకు ఎక్కడెక్కడో ఉన్న జిల్లాల నుంచీ పోలీసులను తరలించి మోహరిస్తారు.

Praja Galam: జగన్.. పోలీసులు ఎక్కడ..!?

  • ప్రధాని పాల్గొన్న సభపైనా నిర్లక్ష్యం

  • ట్రాఫిక్‌ నియంత్రణ గాలికి

  • కిలోమీటర్ల కొద్దీ వాహనాలు

  • సభా ప్రాంగణంలో తొక్కిసలాట

  • ‘సౌండ్‌’ స్టాండ్లపైకి ఎక్కిన జనం

  • ఆడియో కేబుల్‌ తెగి ఆగిన సౌండ్‌ సిస్టమ్‌

  • ప్రధాని ప్రసంగిస్తుండగానే అంతరాయం

  • అయినా పట్టించుకోని పోలీసులు

  • నిర్లక్ష్యం ఉద్దేశపూర్వకమనే అనుమానం

( గుంటూరు/నరసారావుపేట- ఆంధ్రజ్యోతి) :

ముఖ్యమంత్రి జగన్‌ (CM YS Jagan) తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటికి వస్తున్నారంటేనే... కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ను ఆపేస్తారు! జగన్‌ రాజకీయ సభలకు ఎక్కడెక్కడో ఉన్న జిల్లాల నుంచీ పోలీసులను తరలించి మోహరిస్తారు. కానీ... ఏకంగా ప్రధానమంత్రి పాల్గొన్న ‘ప్రజాగళం’ (Praja Galam) సభపై మాత్రం పోలీసు అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీగా జనం తరలి వస్తారని తెలిసినా ట్రాఫిక్‌ నియంత్రణను పట్టించుకోలేదు. దీంతో సభా ప్రాంగణానికి అటూఇటూ కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయాయి. చిలకలూరిపేట నుంచి నరసరావుపేట రహదారి, కొత్త బైపాస్‌ రోడ్డులో బొప్పూడికి ఉన్న రహదారుల్లో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సభావేదికపై నుంచి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పదేపదే పల్నాడు, బాపట్ల, గుంటూరు ఎస్పీలకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్‌ను గాలికి వదిలేశారని నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక... పార్కింగ్‌ స్థలాల నిర్వహణనూ పట్టించుకోలేదు. ప్రాంగణంలోకి ప్రజలు వెళ్లే సందర్భంలో కూడా పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మీడియా గ్యాలరీతో పాటు మెడికల్‌ క్యాంపు వైపు కూడా కార్యకర్తలు దూసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. మహిళలకు కేటాయించిన గ్యాలరీల్లోకి పురుషులు వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.

Praja-Galam-Sabha.jpg

సభలో తొక్కిసలాట..

పోలీసులు పట్టించుకోకపోవడంతో సభా ప్రాంగణంలో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించే సమయంలో కొంతమంది కార్యకర్తలు సౌండ్‌ సిస్టం కోసం ఏర్పాటు చేసిన స్టాండ్‌లపై కూడా ఎక్కి నిలబడ్డారు. వారిని వారించేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్టాండ్‌ పైనుంచి కార్యకర్తలు కిందకి దిగే వరకు కూడా ప్రధానమంత్రి దిగాలని వారికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. పైనుంచి దిగాలని చంద్రబాబు రెండు చేతులు జోడించి కార్యకర్తలను వేడుకోవడం కనిపించింది. అప్పుడు కూడా పోలీసులు జోక్యం చేసుకోలేదు. ఆడియో కేబుల్స్‌ తెగడంతో పలుమార్లు సౌండ్‌ సిస్టమ్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రధాని మూడు నాలుగు నిమిషాలపాటు ప్రసంగాన్ని నిలిపి వేయాల్సి వచ్చింది. కార్యకర్తలను నియంత్రించాలని నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన కనిపించలేదు. టీడీపీ ముఖ్య నేతలు వేదిక దిగి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. కొన్ని రోజులక్రితం ఇదే మార్గంలో జగన్‌ నిర్వహించిన సభకు ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు రేయింబవళ్లు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు... ఏకంగా ప్రధాని హాజరైన సభను కూడా పట్టించుకోకపోవడం, కోడ్‌ వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Mar 18 , 2024 | 09:10 AM