AP Politics: తాను అక్కడి నుంచి పోటీ చేయట్లేదు.. మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 16 , 2024 | 08:42 PM
తాను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయట్లేదని.. త్వరలోనే పార్టీ హై కమాండ్ కొత్త ఇన్‌చార్జిని నియమిస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. పార్టీ సమీకరణాల దృష్ట్యా తాను గతంలో పోటీ చేసిన ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
విశాఖపట్నం: తాను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయట్లేదని.. త్వరలోనే పార్టీ హై కమాండ్ కొత్త ఇన్‌చార్జిని నియమిస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. పార్టీ సమీకరణాల దృష్ట్యా తాను గతంలో పోటీ చేసిన ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజధాని ఫైల్స్’ అనే సినిమా.. వాస్తవ పరిస్థితికి సజీవ సాక్ష్యమని అన్నారు. ఈ సినిమా బయటకు వస్తే రాజధాని అమరావతిలోని వాస్తవాలు బయటకు తెలుస్తాయని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై గతంలో మాటిచ్చి జగన్ మాట తప్పారన్నారు. వైజాగ్ క్యాపిటల్ అని రుషికొండల్లో విలాసం అంతా భవనం కట్టారని.. ఎక్కడ ఒక ఇటుక వేయలేదని చెప్పారు. జగన్ రాజధాని విషయంలో మూడు ముక్కలాటాడుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను.. రాజధాని ఏదని అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సిగ్గులేకుండా ఏపీకి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కావాలంటూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘వలంటీర్లు సైతం మీరే, మా సైన్యం’ అంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పుకుంటున్నారంటే ఆయన పరిస్థితి అర్థం అవుతోందన్నారు. బీజేపీతో పొత్తు ఉంటుందని తాను వ్యక్తిగతంగా అనుకుంటున్నానని.. ఏదైనా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు.