Share News

Devineni Uma: విలేకరులపై దాడి చేసే హీనస్థితికి జగన్ దిగజారిపోయాడు

ABN , Publish Date - Feb 19 , 2024 | 10:04 PM

సామాజిక న్యాయం పేరు ఎత్తే అర్హత కూడా సీఎం జగన్‌కు లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు.

Devineni Uma: విలేకరులపై దాడి చేసే హీనస్థితికి జగన్ దిగజారిపోయాడు

ఎన్టీఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం): సామాజిక న్యాయం పేరు ఎత్తే అర్హత కూడా సీఎం జగన్‌కు లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్మార్గుడు, ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాసే పెన్నుపై, చూపించే కెమెరాలపై వైసీపీ గుండాలు దాడి చేస్తున్నారంటే ఒకప్పటి బీహార్ గురించి ఇప్పుడు ఏపీ గురించే చెప్పుకుంటున్నారని అన్నారు. విలేకరులపై దాడులు చేసే హీనస్థితికి జగన్ దిగజారిపోయాడని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని చెప్పారు. ప్రధాన పత్రికలపై దాడి చేస్తున్నారంటే ఏపీను ఎటువైపు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సభలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

వలంటీర్లను, వైసీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని ‘సిద్ధం’ సభలు పెట్టుకుని తొడలు కొట్టుకుంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఆయన చెప్పే లక్షల కోట్లు, ఎవరి అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయి ? శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా ? అని సవాల్ విసిరారు. జగన్ నొక్కిన బటన్లలో కోట్ల బొక్కుడు మాత్రమే ఉందని ఆరోపించారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవులను తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. సీబీఐ, ఈడీ కేసుల్లో శిక్ష పడగానే ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం బహిష్కరిస్తుందని మందలించారు. చంద్రబాబును విమర్శిస్తే చూస్తు ఊరుకోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘తిరుమల కొండపైకి చంద్రబాబుతో నడిచే దమ్ము ధైర్యం నీకుందా ? నువ్వా ఆయన వయస్సును.. ఆయన శక్తిసామర్థ్యాలను ప్రశ్నించేది’ అని జగన్ తీరుపై మండిపడ్డారు.

21వ తేదీ నుంచి రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట నుంచి ‘‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ’’ కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) తాను నిర్వహిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలు స్టార్ క్యాంపైనర్లుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ ఒక రాజకీయ వ్యాపారని.. ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి నేడు గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. జగన్ రైతుల పొలాలను లాక్కోడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ పెత్తందారీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొడతారని.. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయమని హెచ్చరించారు. ఒక జర్నలిస్టు సోదరుడు రాసిన విధ్వంసం అనే పుస్తకం రాష్ట్రాన్ని కదిలిస్తోందని తెలిపారు. రాజధానిపై జగన్ చేసిన మోసాన్ని ‘రాజధాని ఫైల్స్’ సినిమాలో చూపించారని వివరించారు. రూ.16 లక్షల పెట్టుబడులు గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువస్తే తెచ్చిన పెట్టుబడులను సైతం తరిమికొట్టేసి పరిశ్రమలను వెళ్లగొట్టారని దయ్యబట్టారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి 160 అడుగుల లోతు గొతిలో పాతిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని దేవినేని ఉమా హెచ్చరించారు.

Updated Date - Feb 19 , 2024 | 10:04 PM