AP Politics: ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ ఛార్జ్ షీట్
ABN , Publish Date - Feb 04 , 2024 | 09:13 PM
సీఎం జగన్ రెడ్డి(CM Jagan Reddy) ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ... ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ పేరుతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి(CM Jagan Reddy) ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ... ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ పేరుతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. సీఎం చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది పెద్ద బూటకమన్నారు. అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి... అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని మండిపడ్డారు. మొత్తం 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా... 99 శాతం అమలు చేశానంటూ ప్రజలను జగన్ వంచిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఉద్యోగాల భర్తీ హామీ ఏమైంది..?
విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి రూ.64 వేల కోట్ల భారం మోపారన్నారు. మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు చేశారన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీని గాలికొదిలేశారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో... ఒక్కో కుటుంబంపై ఈ ప్రభుత్వం రూ.8 లక్షల భారం మోపిందన్నారు. వారంలో సీపీఎస్ రద్దు హామీపై మాట తప్పారన్నారు. తెలియక హామీ ఇచ్చానంటూ తప్పించుకున్నాడన్నారు. మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. జలయజ్ఞం అంటూ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారని ఆ హామీ ఏమైందని నిలదీశారు. సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్‌పై నాలుక మడతేశారని దెప్పిపొడిచారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ హామీ గాలికొదిలేశారన్నారు. తాను ఇచ్చిన ఏ హామీనీ జగన్ అమలు చేయలేదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.