Pawan Kalyan: నేరపూరిత వైసీపీతో బలంగా పోరాడుతున్నా
ABN , Publish Date - Jan 12 , 2024 | 07:25 PM
నేరపూరిత వైసీపీ( YCP ) తో బలంగా పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ‘జనసేనానితో గ్లాసు టీ’ కార్యక్రమం నిర్వహించారు.

అమరావతి: నేరపూరిత వైసీపీ( YCP ) తో బలంగా పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ‘జనసేనానితో గ్లాసు టీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యువతీ యువకుల ఆలోచనలు విన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘‘శక్తివంతమైన యువ సమూహం అండ నాకు ఉంది. నాకు నిరంతరం వెన్నంటి ఉండేది యువత బలమే. సగటు మనిషి ఆవేదనలు తీర్చాలంటే చట్టసభల్లో మన గొంతు బలంగా వినబడాలి. నవతరం ఆలోచనలు ప్రభావితం చేసేలా ఉండాలి. యువతకు భరోసా కల్పించేలా ప్రజా పాలసీలను తీసుకువస్తాం. యువతరానికి కచ్చితంగా నేను పూర్తి స్థాయిలో అండగా నిలిచే బాధ్యత తీసుకుంటాను’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా గంజాయి
‘‘రాజధానితో పాటు అన్ని జిల్లాల్లోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలి. అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉండాలి. ఈ దిశగా నేను ఆలోచిస్తాను. కేవలం ఐటీ సెక్టార్ మాత్రమే గౌరవప్రదమైనది, ఉన్నతమైనది అనే ఆలోచన కాకుండా.. వ్యవసాయం, వ్యాపారం ఇతర రంగాలు కూడా అద్భుతమైనవి అనేలా తీర్చిదిద్దాలి. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను అది చేస్తాను... అని చెప్పను. అందరికీ ఉపయోగపడే పనులు మాత్రం కచ్చితంగా చేస్తానని మాట ఇస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది నేరాలకు ప్రధాన మూలం. గంజాయి మత్తులో నేరాలు పెరిగాయి. నేరాలను అరికట్టాలంటే ముందుగా గంజాయి ముఠాలను కట్టడి చేయాలి. అధికారంలోకి వచ్చాక యువత గొంతు అవుతా. నేను యువత చెప్పే ప్రతి ఆలోచనలను జాగ్రత్తగా వింటాను. అవసరమైతే అన్నీ ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకొస్తాను. వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకువస్తా. యువతకు మంచి భవిష్యత్ ఇచ్చేలా భరోసా ఇస్తాం’’ అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.