Share News

Nadendla Manohar: వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా

ABN , Publish Date - Feb 01 , 2024 | 06:00 PM

వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా అవుతుందని... వారి వల్ల ఎవరికి ప్రయోజనమని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. సీఎం సలహాదారుల పేరుతో 680 కోట్లు ఖర్చు చేశారంటూ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nadendla Manohar: వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా

అమరావతి: వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా అవుతుందని... వారి వల్ల ఎవరికి ప్రయోజనమని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. సీఎం సలహాదారుల పేరుతో 680 కోట్లు ఖర్చు చేశారంటూ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సలహాదారులపై కోర్టుకు కూడా వెళ్లామని చెప్పారు. డివిజన్ బెంచ్ ఈ వివరాలను కోర్టుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. గురువారం నాడు జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సలహాదారుల వల్ల ప్రభుత్వంలో కొత్త విదానాన్ని తెచ్చామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అర్హత ఉన్న వ్యక్తులనే తాము సలహాదారులుగా నియమించినట్లు చెప్పారన్నారు. వారందరికీ జీతాలు, అలెవెన్స్, సదుపాయాలు, సిబ్బందిని ప్రభుత్వమే అందిస్తుందన్నారు. సలహాదారులు సీఎంని కలిసే పరిస్థితి లేదన్నారు. విలువలతో ఉన్న ప్రభుత్వ సలహాదారులు కొంతమంది తమకు పని లేదంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారని గుర్తుచేశారు. సుభాష్ గర్గ్ , రామచంద్రమూర్తి, జుల్ఫీ వంటి వారు ఈ పదవికి రాజీనామా చేశారని తెలిపారు.

80 నుంచి 90 మంది సలహాదారుల కోసం 680 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. వీరిలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరికే 140 కోట్లు ఖర్చుచేసిందని ధ్వజమెత్తారు. అసలు ఈ సలహాదారులు ప్రభుత్వానికి, సీఎంకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలల్లో వసతులు కల్పించకుండా.. ఐబీ సిలబస్‌ను అమలు చేస్తున్నామని అంటున్నారని... ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారని నిలదీశారు. ఈ సలహాదారుల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు.. వారెవరో.. కనీసం సీఎంకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంతో రోజూ మాట్లాడేది కేవలం ఇద్దరు సలహాదారులు మాత్రమేనని చెప్పారు. సీఎం మీడియా ముందుకు వచ్చి.. తాను పెట్టుకున్న సలహాదారులు గురించి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును తింటూ... ప్రతిపక్షాలను సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శిస్తాడా అని మండిపడ్డారు. వారి సలహాల వల్ల ఏ అంశాలల్లో మార్పు జరిగిందో చెప్పాలని.. పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి సలహాదారుల కోసం సీఎం జగన్ 680 కోట్లు ఖర్చు పెడతారా అని ప్రశ్నించారు. ఏ బడ్జెట్ కింద ఈ డబ్బులు ఖర్చు పెట్టారో.. శాసనసభ సమావేశాల్లో చెప్పాలని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

Updated Date - Feb 01 , 2024 | 06:00 PM