Share News

AP Election 2024: టికెట్లు మాకే ఇవ్వాలి.. బీజేపీ డిమాండ్!

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:46 AM

‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ బీజేపీలో పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో గెలుపుపై ధీమా పెరిగి.. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా

AP Election 2024: టికెట్లు మాకే ఇవ్వాలి.. బీజేపీ డిమాండ్!

  • బీజేపీలో పెరుగుతున్న ఆశావహులు

  • టీడీపీ-జనసేనతో పొత్తుతో గెలుపుపై ధీమా

  • నాయకత్వంపై ఒత్తిడికి యత్నాలు

  • కర్ణాటక నుంచి సైతం సిఫారసులు

అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ బీజేపీ (AP BJP) లో పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో గెలుపుపై ధీమా పెరిగి.. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా సమాచారం తెలుసుకుని.. తాము కన్నేసిన సీట్లు వాటిలో ఉంటే తమకు అన్యా యం జరిగిందంటూ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఓ మోస్తరు నాయకులకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సర్ది చెప్పి పంపుతున్నారు. మరికొందరు మాత్రం ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. తాము బరిలో నిలుస్తామంటూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. లోక్‌సభ సీటు కోసం ‘తపన’ పడుతున్న ఒక నాయకుడు నాలుగు రోజుల క్రితం ఇలాంటి భేటీ పెట్టారు. పార్టీ కోసం కష్టపడ్డాను.. కోట్లు ఖర్చు చేశానని ఆయన ఆ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నాయకత్వం ఘాటుగా స్పందించింది. స్వచ్ఛంద సేవ ముసుగులో సొంత కార్యక్రమాలు చేపట్టి అవన్నీ పార్టీ కోసమంటే ఎలాగని నిలదీసింది. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పనిచేసి గెలిచే అభ్యర్థులకే సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది. పార్టీలో ఎంతో మంది సీనియర్లు టికెట్‌ దక్కినా, దక్కకున్నా పనిచేస్తున్నారని.. మీరు బెదిరిస్తే నాయకత్వం భయపడదని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక అసంతృప్త నేతను సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. మరోవైపు.. అనంతపురం పార్లమెంటు స్థానం తనకు ఇప్పించాలంటూ ఇటీవలే పార్టీలో చేరిన ఒక నాయకుడు కర్ణాటక నేతల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జై పాండా, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో జరిగిన చర్చల్లో బీజేపీకి పది అసెంబ్లీ, ఆరు పార్లమెంటు స్థానాలు దక్కగా.. జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లు దక్కాయి. మిగతా 144 అసెంబ్లీ, 17పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఆదోని, ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు(ఎస్సీ), విజయవాడ పశ్చిమ, కైకలూరు, అనపర్తి అసెంబ్లీ సీట్లు ఖరారైనట్లు చెబుతున్నా అనపర్తి అభ్యర్థిని ఇప్పటికే టీడీపీ ప్రకటించినందున పి.గన్నవరం (ఎస్సీ) సీటును బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, పాడేరు(ఎస్టీ), విశాఖ ఉత్తరం బీజేపీకి దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఆదోని అభ్యర్థిగా బీసీ వైద్యుడి పేరు బలంగా వినిపిస్తోంది. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డికి కుటుంబ సభ్యుల నుంచే సహకారం లభించడం లేదు. విజయవాడ పశ్చిమను బీజేపీకి కేటాయించడంపై జనసేన శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ పార్టీకి చెందిన బలమైన బీసీ సామాజిక వర్గం నేత నిరసనకు దిగారు. మరోవైపు కైకలూరు, అనపర్తి స్థానాలను వయసు మళ్లిన వారికి ఇస్తే ఊరుకోబోమని కొందరు పట్టుబడుతున్నారు. పాడేరు నుంచి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, విశాఖ ఉత్తరంలో విష్ణుకుమార్‌రాజు పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అయితే శ్రీకాకుళం సీటుపై పార్టీలో గందరగోళం నెలకొంది. అక్కడ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎదుర్కోగల సమర్థ నాయకుడు బీజేపీకి లేరని పార్టీ పెద్దలకు ఫోన్లు వస్తున్నాయి. దాని బదులు అదే జిల్లాలో పాతపట్నం సీటు తీసుకోవాలని.. అక్కడ బీసీ అభ్యర్థిని బరిలో దించితే ఫలితం మెరుగ్గా ఉంటుందని అంటున్నట్లు తెలిసింది.

Updated Date - Mar 19 , 2024 | 09:55 AM