Share News

AP Elections: నెల్లూరు ఎంపీగా గెలిచేదెవరు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరింటే..?

ABN , Publish Date - May 03 , 2024 | 12:35 PM

ఏపీలో అందరిదృష్టి ఆకర్షిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో నెల్లూరు ఒకటి. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి సైతం వైసీపీ, టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఎవరు విజయం సాధిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

AP Elections: నెల్లూరు ఎంపీగా గెలిచేదెవరు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరింటే..?
YSRCP, TDP, Congress

ఏపీలో అందరిదృష్టి ఆకర్షిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో నెల్లూరు ఒకటి. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి సైతం వైసీపీ, టీడీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఎవరు విజయం సాధిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి చీల్చే ఓట్లు విజేతను నిర్ణయించనున్నాయి. ఇక్కడి విజయాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు వైసీపీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఓటర్లు వైసీపీకి అండగా నిలిచారు. దీంతో ఈ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని వైసీపీ భావిస్తోంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది టీడీపీలో చేరడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సైకిల్ పార్టీ బలం పెరిగినట్లు తెలుస్తోంది.


నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారి కొప్పుల రాజు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బరిలో దిగడంతో నెల్లూరు లోక్‌సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీచేస్తున్నారు. దీంతో వైసీపీ విజయసాయిరెడ్డికి టికెట్ కేటాయించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల టీడీపీలో చేరగా.. ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్‌ను కేటాయించారు. నెల్లూరు పార్లమెంట్‌స్థానంలో ఎవరు గెలుస్తారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మళ్లీ జగన్‌ వద్దు!


విజయసాయిరెడ్డి గెలిచేనా..

వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గెలుపును ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో కీలకనేతగా ఉండటంతో ఆయన ఓడిపోతే జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మైనస్‌గా మారే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే జిల్లాలో వైసీపీ కొంత బలహీనపడింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎక్కువ అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉండటంతో.. వైసీపీకి నష్టం కలగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి విజయసాయిరెడ్డి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.


వేమిరెడ్డికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయంటే..

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల కాలంలో సీఎం జగన్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన జిల్లాలోని రాజకీయ పరిణామాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో ఆయనను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. సామాజికవర్గం పరంగా, ఆర్థిక పరంగా బలమైన అభ్యర్థి కావడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు జనసేన, బీజేపీ మద్దతు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత సైతం టీడీపీ అభ్యర్థికి ప్లస్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతానికి నెల్లూరు లోక్‌సభ స్థానంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విజయవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


కొప్పులతో ఎవరికి నష్టం..

నెల్లూరు కలెక్టర్‌గా పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారి, కాంగ్రెస్ జాతీయ నాయకుడు కొప్పుల రాజు నెల్లూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కొప్పుల రాజు ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. తాను గెలుస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నా.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సాధించే ఓట్లు వైసీపీ, టీడీపీ అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. ఐఎఎస్ అధికారిగా నెల్లూరు జిల్లాలో పనిచేసిన అనుభవం, ఇక్కడి ప్రజలతో ఆయనకు ఉన్న పరిచయాలు తనకు కలిసొస్తాయని కొప్పుల రాజు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన దళిత ఓటర్లు 2014 తర్వాత జగన్‌ వైపు మొగ్గుచూపారు. ప్రస్తుతం దళిత సామాజిక వర్గానికి చెందిన కొప్పుల రాజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండటంతో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు కలిసొస్తాయనే ధీమాలో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. నెల్లూరులో ప్రస్తుతం త్రిముఖ పోరు కనిపిస్తున్నప్పటికి ఎన్డీయే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విజయవకాశాలు ఎక్కవుగా ఉన్నట్లు తెలుస్తోంది.


20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 12:47 PM