Share News

మళ్లీ జగన్‌ వద్దు!

ABN , Publish Date - May 03 , 2024 | 05:13 AM

విశాఖలో భూములు లాక్కుంటున్నారు. ధనవంతులు భయపడి అమెరికాకు వెళ్లిపోతున్నారు. ఎన్నాళ్లిలా? ఎంతమంది సొంత ఇళ్లను వదిలి వెళ్లిపోగలరు? మేం అండగా ఉంటాం.

మళ్లీ జగన్‌ వద్దు!

వైసీపీకి ఓట్లు వేస్తే ఆస్తులు పోతాయ్‌.. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి

మన తల రాత మనమే మార్చుకోవాలి.. ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే మార్పు సాధ్యం

చిన్న రాయి తగిలితే బ్యాండేజీ వేసి ఏదో జరిగిపోయినట్లు సీఎం బిల్డప్‌

30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యం.. ఆ తల్లిదండ్రుల ఆవేదన తెలియదా మరి!?

రంగులకు తగలేసిన దానిలో పదో వంతు ఇచ్చినా తోటపల్లి, జంపరకోట పూర్తి

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం.. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి: పవన్‌

విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి/పాలకొండ, మే 2: ‘విశాఖలో భూములు లాక్కుంటున్నారు. ధనవంతులు భయపడి అమెరికాకు వెళ్లిపోతున్నారు. ఎన్నాళ్లిలా? ఎంతమంది సొంత ఇళ్లను వదిలి వెళ్లిపోగలరు? మేం అండగా ఉంటాం. మీరు ధైర్యంగా నిలబడండి. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయండి ’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన మన్యం జిల్లా పాలకొండలో, విశాఖలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడా రు. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఇక్కడే నటనలో ఓనమాలు నేర్చుకున్నానన్నారు. తన సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో ఓ పాట బాగా గుర్తుకు వస్తోందంటూ...‘మల్లీ నీకెందుకురా పెళ్లి?’ అనే పాట పాడి వినిపించారు. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు వర్తిస్తుందన్నారు. అధికారం ఇస్తే సీపీఎస్‌ రద్దు చేస్తానని, మెగా డీ ఎస్సీ నిర్వహిస్తానని, ఏటా జాబ్‌ కేలెండర్‌ విడుదల చేస్తానని ఇలా చాలా చెప్పారని, కానీ ఏదీ చేయలేదని..అటువంటి వ్యక్తికి మళ్లీ ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. అందుకే ‘మల్లీ.. నీకెందుకురా పెళ్లి’ అంటున్నానని చమత్కరించారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపైనే తొలి సంతకమని పవన్‌ ప్రకటించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు వేయ డానికి, తీయడానికి రూ.2,300 కోట్లు తగలేసిందని ధ్వజమె త్తారు. ఇందులో పదో వంతు రూ.214 కోట్లు ఇచ్చి ఉంటే తోటపల్లి ఎడమ కాలువ, జంపరకోట పనులు పూర్తయ్యేవని చెప్పారు. తాను మాటిస్తున్నానని, కూటమి ప్రభుత్వం రాగానే గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడడంతో పాటు సబ్సిడీపై ట్రైకార్‌ రుణాలు అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు. సీపీఎస్‌ రద్దుకు సంబంధించి ఏడాదిలోగా బలమైన పరిష్కారం చూపిస్తామన్నారు.ఇంకా ఏమన్నారంటే..


రాజకీయ నాయకులకు ఓటమి తెలియాలి

రాజకీయ నాయకులకు ఓటమి తెలియాలి. అప్పుడే బాధ్యతగా ఉంటారు. పదవులు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ ప్రజలను కష్టాల్లో ఆదుకుంటే వారి గుండెల్లో నాయకుల స్థానం చెక్కు చెదరకుండా ఉంటుంది. దాని కోసమే ప్రయత్నిస్తున్నా. చంద్రబాబును జైల్లో పెడితే.. రాజమండ్రి వెళ్లి ఆయనకు అండగా నిలబడినప్పుడు సొంత పార్టీ వారే నన్ను ప్రశ్నించారు. ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యతే శత్రువైన జగన్‌కు బలంగా మారుతోందని.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉంటేనే వైసీపీని ఓడించగలుగుతామని.. ప్రజలకు మంచి చేయగలుగుతామని, అందుకే అలా చేశానని చెప్పా ను. గాజువాక నుంచో, భీమవరం నుంచో గెలిపించి ఉంటే.. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలను చొక్కొ పట్టుకుని సమస్యలపై ప్రశ్నించేవాడిని. కూటమిని గెలిపిస్తే మేమే కాకుండా అందరితో పనిచేయిస్తాం. జగన్‌ వంటి దుష్టుడి నుంచి ప్రజలను కాపాడాలంటే.. పోరాటమే శరణ్యం. యువత సముద్రంలా ఆవేశంగా ఉప్పొంగగలదు. మహిళలకు ఆదిపరాశక్తికి ఉన్నంత శక్తి ఉంది. అంతా కలిసి పోరాటం చేస్తే అనుకున్నది సాధించగలుగుతాం. ఉత్తరాంరఽధలో చక్కటి క్రీడాకారులు ఉన్నారు. కరణం మల్లీశ్వరి వంటి వారు ఈ ప్రాంతం వారే. అలాంటి వారిని మరింత మందిని తయారు చేయడానికి విశాఖను ఆర్థిక రాజధానిగానే కాకుండా క్రీడా రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. ల్యాండ్‌ టైటిల్‌ చట్టంతో ప్రతి ఒక్కరూ ఆస్తులు కోల్పోవలసి వస్తుంది. ఆలోచించుకుని మరీ ఓట్లు వేయాలి.

జగన్‌ తన సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేదు. వారికి తగిన గౌరవం ఇవ్వలేదు. దాంతో వారు న్యాయం కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. అటువంటి వ్యక్తి మహిళల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని కోరుకోవడం కూడా అవివేకమే.

‘భవన కార్మికుల సంక్షేమ నిధి రూ.450 కోట్లను జగన్‌ ప్రభుత్వం దోచుకుంది. మేం రాగానే తిరిగి ఆ నిధిని అందుబాటులోకి తెస్తాం. ఆ నిధికి నేను కోటి రూపాయలు విరాళంగా అందిస్తా.

చిన్న రాయి తగిలితే దానికి బ్యాండేజీ వేసి, మేకప్‌ వేసుకొని ఏదో జరిగిపోయినట్లు బిల్డప్‌ ఇచ్చిన జగన్‌కు.. 30 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే.. వారి తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో తెలియకుండా పోయింది. కనీసం వారిని కలిసి ఓదార్చాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు.

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - May 03 , 2024 | 05:13 AM