Share News

AP Politics: లోక్ సత్తా జేపీ సంచలన నిర్ణయం.. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటన

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని బుధవారం నాడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.

AP Politics: లోక్ సత్తా జేపీ సంచలన నిర్ణయం.. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ (Jaya Prakash Narayana) మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని బుధవారం నాడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ (JP) వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ (Jaya Prakash Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని వివరించారు. వైసీపీ (YCP) వైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని పేర్కొన్నారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదన్నారు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదని జేపీ (JP) సూచించారు. సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అని హెచ్చరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలని జయప్రకాశ్ నారాయణ (Jaya Prakash Narayana) సూచించారు. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని జయప్రకాశ్ నారాయణ (Jaya Prakash Narayana) వివరించారు. ఉపాధి కల్పించి, పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి రూపాయి ప్రజలదే

రాష్ట్రంలో కులాల గురించి ఎక్కువ ప్రస్తావన జరగడం విచారకరం అని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. కులాలకు అతీతంగా పనిచేసే నేత లేరని పేర్కొన్నారు. గతంలో చాలామంది నేతలు కుల మతాలకు అతీతంగా సమాజం కోసం పనిచేశారని వివరించారు. కొందరు మూర్ఖులు, అజ్ఞానులుగా మారారని ధ్వజమెత్తారు. తప్పు ఎత్తి చూపితే చాలు కులం, మతం, ప్రాంతం పేరు తెరపైకి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారు నియంతలా వ్యవహరిస్తున్నారని జేపీ మండిపడ్డారు. మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలదే.. మన డబ్బు మన హక్కు అని వివరించారు. ‘దేశానికి, ప్రజలకు మంచి జరగాలంటే ఆర్థిక ప్రగతి అవసరం. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి మాట లేకుండా పోయింది. ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయింది. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. దోపిడీ చేస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. ప్రజా పాలన ఇది కాదు అని’ జేపీ ధ్వజమెత్తారు.

ఒడిశా కన్నా దారుణం

ఒడిశా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని జేపీ మండిపడ్డారు. ‘ఒడిశాలో రూ.26 వేల కోట్ల రెవెన్యూ ఉంది. అవసరం మేరకు అప్పులు చేస్తారు. హంగు లేదు.. ఆర్బాటం లేదు. ప్రచారం అంతకన్నా లేదు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సుపరిపాలన అందుతోంది. సంస్కరణలు సాధ్యం కాదు అనేవారు అవినీతి పరులు, అసమర్థులు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేక పోయారు. కుల, మతం, హింస రాజ్యమేలిన ఉత్తర ప్రదేశ్ తీరు కూడా మారింది. ఏపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది అని’ జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

AP Election 2024: వైసీపీలో చేరిన విజయవాడ బీజేపీ నేత వంగవీటి నరేంద్ర

TG Politics: టచ్‌లో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

Updated Date - Mar 20 , 2024 | 06:41 PM