Share News

జనమంటే జగన్‌కు భయమా?

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:31 AM

’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్‌కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,

జనమంటే జగన్‌కు భయమా?

  • ప్రచారానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు ఎందుకు?

  • రూల్స్‌ ప్రకారం ఆర్టీసీ ఆ వాహనాలు ఇవ్వడానికి లేదు

  • భద్రతకు ముప్పు ఉన్నవారికే ఆ వెసులుబాటు

  • డబ్బులిచ్చి అద్దెకు కూడా తీసుకోరాదంటున్న ఈసీ

  • జనం అంటే భయంతో ఇన్నాళ్లు బయటకు రాని సీఎం

(అమరావతి-ఆంధ్రజ్యోతి):

’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్‌కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు, ఇప్పుడు జనానికి అందనంత ఎత్తున్న బస్సుపై అభివాదం చేసేందుకే ఎందుకు పరిమితమయ్యారు.? ప్రతిపక్షంలో ఉన్నప్పు డు పాదయాత్ర చేస్తూ ప్రజల చెంతకు జగన్‌ (YS Jagan ) వెళ్లేవారు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక పరదాల చాటున, బారికేడ్ల మాటున ప్రజల్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఓట్ల కోసం జనంలోకి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో ఎందుకు వెళుతున్నారు? ఐదేళ్ల క్రితం చుట్టూ పార్టీ నేతలు ఉండగా, ఇప్పుడెందుకు అంగరక్షకులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇడుపులపాయ నుం చి బస్సు యాత్ర ప్రారంభించిన జగన్‌ను చూసినవారి నోట ఇప్పుడివే ప్రశ్నలు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఇదే ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఏడాదికిపైగా జగన్‌ నడిచారు. మద్య నిషేధం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు పాత పెన్షన్‌, ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి...ఇలా ఒకటి రెండు కాదు, నోటికి వచ్చినన్ని హామీలిచ్చేసి అధికారంలోకి వచ్చారు. కుర్చీ ఎక్కగానే జనాన్ని పూర్తిగా మరిచిపోయి తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చొని, అప్పుడప్పుడు బటన్లు నొక్కడమే తనదైన పాలనగా చూపించారు. ఎప్పుడైనా తప్పక వెళ్లాల్సి వస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆపేసి చెట్లు నరికించేసి, పరదాలు కట్టించి, బారికేడ్లు పెట్టించిన తర్వాతే బయటికి వచ్చారు. ఎన్నికలు వచ్చేసరికి అవన్నీ దాటేసి అత్యంత శక్తివంతమైన బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సుల్లో ప్రజల్లోకి బయలుదేరారు. పేదల పక్షపాతిగా పదే పదే ప్రకటించుకునే జగన్‌, అప్పటికి, ఇప్పటికి ఇంతలా మారిపోయారేంటి.? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, నిరుద్యోగులు, రైతులు, వైసీపీ బాధితులు నిలదీసే ప్రమాదం ఉన్నందునే ఏర్పాట్లు చేసుకున్నారనేది మరికొందరి అభిప్రాయం.

ఏమి కఠిన చర్యలు చేపట్టారని ముప్పు?

సీఎంగా జగన్‌ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అంతటి కఠిన నిర్ణయాలు ఏవీ ఆయన తీసుకోలేదు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు ఆయన హయాంలో జరగనే లేదు. ఉగ్రవాద మూలాల్లాంటివి ఏపీలో ఎప్పుడూ కనిపించ వు. పోనీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తరహాలో రౌడీలు, గుండాలపై బుల్లెట్‌ ప్రయోగించారా.. అంటే మాస్క్‌ అడిగిన దళిత వైద్యుడిని, సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన వారి భరతం పట్టడమే జగన్‌ పాలనలో పోలీసుల పని. అలాంటప్పుడు ఆయనకు ముప్పెందుకు ఉంటుందంటూ అందరూ అంటున్నారు.

కోడ్‌ అమల్లోకి వచ్చాక ప్రతిదీ ఈసీ మార్గదర్శకాల మేరకే అమలవ్వాలి. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల వినియోగం నుంచి సాయుధ రక్షణ విషయం వరకు ఈఏడాది జనవరి 2న కేంద్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రధానమంత్రి, ఇతర రాజకీయ ప్రముఖుల్లో తీవ్రవాదులు, మావోయిస్టుల నుం చి తీవ్ర ముప్పున్న వారికి మాత్రమే ఆ ఏర్పాట్లు వర్తిస్తాయని సీఈసీలో సీనియర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నరేంద్ర ఎన్‌ బటోలియా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారానికి డబ్బులిచ్చి కూడా బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం వినియోగించడానికి వీల్లేదని చాలా స్పష్టం గా పేర్కొన్నారు. ఇక, జగన్‌ ఎన్నికల ప్రచారానికి రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు, మరో రెండు అధునాతన సౌకర్యాలతో కూడిన కారవ్యాన్లు అడిగారు. ఆర్టీసీ వద్ద ఇప్పటికే రెండు ఉండగా మరో రెండు ఇటీవలే కొనుగోలు చేయాల్సి వచ్చింది. మొత్తం నాలుగూ తనకే కావాలని అడగడంతో ఆర్టీసీ ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరారు. రెండింటికి ఈసీ అనుమతి ఇవ్వడంతో అంతవరకే పంపామని ఆర్టీసీ ఈడీ తెలిపారు.

AP Elections: ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!


అనంతపురం జిల్లా నార్పలకు వచ్చి వెళుతుండగా, గత ఏడాది ధర్మవరం సమీపంలో జగన్‌ కాన్వాయ్‌కు నిమ్మలకుంట వద్ద గ్రామస్ఠులు అడ్డుపడ్డారు. అప్పటినుంచి జనంలోకి రావాలంటేనే జగన్‌ భయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం సహా ప్రధాని తరహా భద్రతా కవచం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా తీవ్ర ప్రాణ ముప్పు ఉన్నవారు మాత్రమే ఆర్టీసీ వంటి ప్రభుత్వ సంస్థలు అందించే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు వాడుకోవాలి. మిగతా నాయకులు డబ్బులిచ్చి కూడా అద్దెకు వాటిని తీసుకోవడానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినా, గత ఐదేళ్లలో మావోయిస్టులు సహా ఎవరి విషయంలోనూ కఠిన చర్యలు తీసుకోని జగన్‌కు ముప్పేముంటుంది?

Updated Date - Mar 28 , 2024 | 08:20 AM