Vijayashanthi : యోగిని రాహుల్ ‘థగ్’ అనడంపై ఫైర్..

ABN , First Publish Date - 2023-02-08T11:31:25+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ‘థగ్’ అనడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు.

Vijayashanthi : యోగిని రాహుల్ ‘థగ్’ అనడంపై ఫైర్..

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath)ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘థగ్’ అనడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఫైర్ అయ్యారు. చదవేస్తే ఉన్న మతి పోయినట్టు దేశమంతా పాదయాత్ర చేసి రాహుల్‌జీ హిందూ వ్యతిరేకతను నేర్చుకున్నట్టుందని విమర్శించారు. నేడు ఫేస్‌బుక్ (Facebook) వేదికగా రాహుల్‌పై ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందువులను తేలిక చేస్తూ వారి మనోభావాలను గాయపరిచే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటమనేది మనం చూస్తున్న సత్యం. అందుకు మరో ఉదాహరణ రాహుల్‌జీ యోగీ ఆదిత్యనాథ్ గారిని థగ్ అనడం. కేవలం 26 ఏళ్ల పిన్న వయసులోకే గోరఖ్‌ పూర్‌ నుంచి ఎంపీగా యోగీజీ ఎన్నికై 12వ లోక్‌సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 1998 నుంచి వరుసగా 5 సార్లు ఎంపీగా గెలిచారు.

44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. యూపీ ప్రజలకు ఆయన పట్ల ఎంతటి విశ్వాసం లేకుంటే ఈ స్థాయి దక్కుతుందో రాహుల్ గారు గ్రహించాలి. చదవేస్తే ఉన్న మతి పోయినట్లు, దేశమంతా పాదయాత్ర చేసి రాహుల్‌జీ హిందూ వ్యతిరేకతను నేర్చుకున్నట్లు ఉన్నది ఈ 'థగ్' ప్రకటన. భారతీయ జనతాకి ఊపిరి మా కార్యకర్తల సిద్ధాంత మనోధైర్యమైతే, పోరాడే కార్యాచరణ స్ఫూర్తి పైన చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకటనలే... మీ విధానంతో కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ లాంటి ప్రాంతీయ పార్టీల నుండి హిందూ వ్యతిరేకులను దగ్గర చెయ్యడం జరగాలనే ప్రయత్నం ఎంతవరకూ నడుస్తదో కానీ, దేశమంతా సాంస్కృతిక జాతీయవాదుల ఐక్యతకు మాత్రం మరో అయోధ్య ఉద్వేగ సమ ప్రభావిత ఆవేశం అయ్యే అవకాశం తప్పక ఉండి తీరుతది’’ అని రాములమ్మ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-08T11:31:27+05:30 IST