సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2023-02-11T09:03:38+05:30 IST

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆఘమేఘాల మీద పూర్తి చేసింది. ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో ఉంది.

సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమేంటంటే..

హైదరాబాద్ : తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆఘమేఘాల మీద పూర్తి చేసింది. ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ (CM KCR) పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్న సంకల్పంతో ఉంది. ఈలోగా ఎన్నికల కోడ్ రానే వచ్చేసింది. ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవి కాలం ముగిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక (Teachers MLC Election) జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సచివాలయానికి అంబేద్కర్ (BR Ambedkar) పేరును పెట్టనున్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు.

సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని పనులను దాదాపు ఇప్పటికే పూర్తి చేసింది తెలంగాణ సర్కార్. ప్రారంభోత్సవం అనంతరం భారీ సభను నిర్వహించాలని సైతం భావించారు. దీనికి సంబంధించి ప్రముఖుల ఆహ్వానాలు సైతం పూర్తయ్యాయి. తమిళనాడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌ (CM Stalin), హేమంత్‌ సోరెన్‌ (Hemanth Soren), బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ (Tejaswi Yadav) తదితర ప్రముఖులకు ఆహ్వానాలు సైతం అందాయి. ఇంతలోనే ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2023-02-11T09:30:30+05:30 IST