Vemula Prashanthreddy: ఆ ప్రసంగం చూస్తే రాహుల్‌ను పప్పు అనడంలో తప్పే లేదు

ABN , First Publish Date - 2023-07-03T12:22:39+05:30 IST

ఖమ్మం సభలో కాంగ్రెస్ నేత రాహుల్ ప్రసంగం చూస్తే ఆయనను పప్పు అనడంలో తప్పు లేదు అనిపించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Vemula Prashanthreddy: ఆ ప్రసంగం చూస్తే రాహుల్‌ను పప్పు అనడంలో తప్పే లేదు

హైదరాబాద్: ఖమ్మం సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) ప్రసంగం చూస్తే ఆయనను పప్పు అనడంలో తప్పు లేదు అనిపించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివి వినిపించి వెళ్లారన్నారు. రాహుల్ గాంధీ రిమోట్ గాంధీగా మారిపోయారని ఎద్దేవా చేశారు. జాతీయ నాయకులకు ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అవగాహన ఉండాలని హితవుపలికారు. తెలంగాణ కంటే గొప్పగా ఏ రాష్ట్రంలో ఏం ఉందో చెబితే బాగుండేదన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో ఏం జరిగిందని... రైతు బంధు, భీమా, 2 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవని అడిగారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇస్తం అంటే ప్రజలు నమ్ముతారా? అని మంత్రి అన్నారు.

జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు జాతీయ విధానం ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నలు కురిపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే పేరెన్నికగన్న ప్రాజెక్ట్ అని దానికి ఖర్చు అయిందే రూ.80 వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని అన్నారు. రాహుల్ సోయి లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. స్కాంలకు రారాజులు మీ కాంగ్రెస్ నేతలంటూ వ్యాఖ్యలు చేశారు. స్కాంలో ఇరుక్కుని ప్రజల చేత తిరస్కరించబడ్డ నేత మీ తండ్రి రాజీవ్ గాంధీ అంటూ దుయ్యబట్టారు. అసలు ఏ హోదాలో రాహుల్ కాంగ్రెస్ విధానాలు ప్రకటించారని అడిగారు. అసలు రాహుల్‌కు కాంగ్రెస్‌లో ఏ హోదా ఉందని.. రాహుల్ ఒక రాజుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమాన దూరం ఉంటామని సీఎం కేసీఆర్ (CM KCR) ముందే ప్రకటించారని గుర్తు చేశారు. తాము ఎవరికీ ఏ టీమ్ కాదు, బీ టీమ్ కాదన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలే బీజేపీకి ఏ టీమ్ బీ టీమ్ గా మారారని తెలిపారు. ఈటెల రాజేందర్ (BJP MLA Etela Rajender), రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) హోటల్స్‌లో కలుసుకున్నారని.. కావాలంటే ఫోటోలు పంపిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-07-03T12:47:39+05:30 IST