Amazon: అమెజాన్ మళ్లీ వెంటనే ఇలా చేస్తుందనుకోలేదు.. పాపం 9 వేల మంది..

ABN , First Publish Date - 2023-04-27T16:51:35+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఎంప్లాయీస్‌పై వేటు వేస్తూ ఏదో ఒక కంపెనీ వార్తల్లో నిలవడం సర్వసాధారణమైపోయింది.

Amazon: అమెజాన్ మళ్లీ వెంటనే ఇలా చేస్తుందనుకోలేదు.. పాపం 9 వేల మంది..

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఎంప్లాయీస్‌పై వేటు వేస్తూ ఏదో ఒక కంపెనీ వార్తల్లో నిలవడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఆమెజాన్ రెండో దఫా ఉద్యోగుల ఉద్వాసన (Amazon layoffs) ప్రక్రియ మొదలుపెట్టింది. రెండో దశ తొలగింపులో మొత్తం 9 వేల మంది ఉద్యోగులు ప్రభావితం కాబోతున్నారు. గత నెలలోనే ప్రకటించిన ఈ ప్రక్రియ బుధవారం అధికారికంగా మొదలైంది. ప్రభావిత ఉద్యోగులను కంపెనీ సీఈవో ఆడమ్ సెలిప్స్కీ (Adam Selipsky), మానవ వనరుల విభాగం అధిపతి బెత్ గలెట్టి (Beth Galetti) బుధవారం నోటిఫై చేశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. క్లౌడ్ సర్వీస్ ఆపరేషన్, హ్యూమన్ రిసోర్సెస్ నుంచి మొదలుకొని వేర్వేరు విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నాయి.

అమెజాన్‌కు అత్యంత లాభదాయక విభాగమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (Amazon Web Services) సేల్స్ వృద్ధి రేటు పడిపోతుండడమే అమెజాన్ ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమైంది. ఈ ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, కొస్టారికా నుంచి మొదలవనుందని తెలిపింది. తమ సంస్థకు ఇది చాలా కఠినమైన రోజు అని అమెజాన్ వెబ్‌సర్వీసెస్ చీఫ్ ఆడమ్ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 9 వేల మంది అమెజాన్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం చాలా కఠినమైనదని ఆయన అభివర్ణించారు. ప్రభావిత ఉద్యోగులతో సంప్రదింపులను బుధవారం మొదలుపెట్టామని తెలిపారు. అమెరికా, కెనడా, కోస్టారికాలో ప్రభావిత ఉద్యోగులకు నోటిఫికేషన్లను పంపించామని చెప్పారు.

తొలగింపునకు గురయ్యే ప్రతి ప్రభావిత ఉద్యోగిని గౌరవప్రదంగా ట్రీట్ చేస్తామని, వేర్వేరు ప్రయోజనాలు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు కీలకమైన ఈ దశలో వారికి సాయం అందిస్తామన్నారు. సెపరేషన్ పేమెంట్, ట్రాన్షిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్, జాబ్ ప్లేస్‌మెంట్ సపోర్ట్‌ వంటి ప్రయోజనాలు ఈ జాబితాలో ఉండనున్నాయని ఉద్యోగులకు పంపిన మెమోలో ఆడమ్ పేర్కొన్నారు.

కాగా మొత్తం 18 వేల మందిని తొలగించబోతున్నట్టు గతేడాది నవంబర్‌లో అమెజాన్ ప్రకటించింది. ఇందులో భాగంగానే 9 వేల మంది ఉద్వాసనకు సిద్ధమైనట్టు మార్చిలో కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు. ఆర్థిక మాంద్యం భయాల వెంటాడుతున్న నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నియామకాల నిలుపుదల, కొన్ని ప్రాజెక్టులను పక్కనపెట్టడం, గిడ్డంగుల విస్తరణను నెమ్మదించడం వంటి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి...

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

Reliance Jio: రిలయన్స్ జియో గుడ్‌న్యూస్!.. త్వరలోనే వైర్లు లేకుండానే...

Updated Date - 2023-04-27T17:00:23+05:30 IST