Tech sector: అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే ఓ గూగుల్ ఉద్యోగికి ఎదురైన అనుభవం ఇది

ABN , First Publish Date - 2023-02-05T21:24:04+05:30 IST

గూగుల్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో ఓ వ్యక్తికి జీవితంలో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. తనకు జన్మనిచ్చిన అమ్మ చనిపోవడంతో సెలవుపై వెళ్లి తిరిగి ఆఫీస్‌కు వచ్చిన 4 రోజుల వ్యవధిలోనే...

Tech sector: అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే ఓ గూగుల్ ఉద్యోగికి ఎదురైన అనుభవం ఇది

టెక్ ఇండస్ట్రీలో (tech industry) అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బడాబడా కంపెనీలు సైతం ఉద్యోగులపై తొలగింపు వేటు వేస్తున్నాయి. ఎడాపెడా తొలగించి వేస్తున్నాయి. ఈ కంపెనీల జాబితాలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google) కూడా ఉంది. 12 వేలమంది ఉద్యోగులను తొలగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఉన్నపళంగా వేటు వేయడంతో ఎంతోమంది టెకీల జీవితాలు తలకిందులయ్యాయి. అనూహ్య తొలగింపులతో రోడ్డునపడ్డారు. ఈ మేరకు చాలామంది ‘లింక్డ్‌ఇన్’ (LinkedIn) వేదికగా తమ వ్యధలను వ్యక్తపరిచాడు. ఇలా బాధను పంచుకున్న గూగుల్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో ఓ వ్యక్తికి జీవితంలో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. తనకు జన్మనిచ్చిన అమ్మ చనిపోవడంతో సెలవుపై వెళ్లి తిరిగి ఆఫీస్‌కు వచ్చిన 4 రోజుల వ్యవధిలోనే అతడి ఉద్యోగం ఊడిపోయింది. అమ్మను కోల్పోయి అప్పటికే పుట్టెడు దు:ఖంలో ఉన్న అతడు ఉద్యోగం కోల్పోవడంతో జీవితంలో అసలు సిసలైన పరీక్ష ఎదురైంది. ఈ మేరకు తన బాధను లింక్డ్‌ఇన్ వేదికగా తెలిపాడు.

తన పేరు టామీ యార్క్ (Tommy York) అని తెలిపిన బాధితుడు.. క్యానర్‌తో పోరాడుతూ డిసెంబర్ 2022లో అమ్మను కోల్పోయానని చెప్పాడు. సెలవు తర్వాత ఆఫీస్‌కు వెళ్లిన నాలుగవ రోజునే ఉద్యోగం ఊడిపోయిందని టామీ తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ పరిణామం చెంపదెబ్బ కొట్టినట్టు అనిపిస్తోందన్నాడు. ఇలాంటి ఎంతోమంది స్టోరీలు విన్నానని అన్నాడు. ‘‘ ఉద్యోగుల తొలగింపు ఎలా జరిగిందో తెలియదు. ఈ సంవత్సరమే నన్ను ఆ దిశగా నడిపించిందేమో అనుకుంటున్నా. డిసెంబర్ 2021లో గూగుల్‌లో ఉద్యోగ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఆ తర్వాత ఫిబ్రవరి 2022లో మా అమ్మకు స్టేజ్-4 క్యాన్సర్ నిర్ధారణయ్యింది. ఆ సమయంలో గూగుల్‌లో నా ఫార్మల్ ఓరియెంటేషన్ ముగిసింది. ప్రాజెక్టుల్లో అడుగుపెట్టాను. గూగుల్‌లో ఆన్‌బోర్డింగ్ సవాలుతో కూడుకున్నదని చెప్పగలను. తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. మరోవైపు మా అమ్మ కిమోథెరపీ అపాయింట్‌మెంట్లు దొరకడం చాలా కష్టమయ్యేది. గడిచిన నెలలు ఆమె జీవితంలో అత్యంత సంక్లిష్టమైనవి. ఇప్పుడు అమ్మని, ఉద్యోగాన్ని కోల్పోయాను’’ అని యార్క్ తన బాధను రాసుకొచ్చాడు.

Updated Date - 2023-02-05T21:24:56+05:30 IST