Viral: క్రికెట్ అంటే ఈ తాతకు ఎంత పిచ్చో.. 83 ఏళ్ల వయసులో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి వికెట్ కిపింగ్

ABN , First Publish Date - 2023-08-06T14:52:52+05:30 IST

ఓ 83 ఏళ్ల వృద్ధుడు ఏకంగా మైదానంలోకి దిగి క్రికట్ మ్యాచే ఆడేస్తున్నాడు. ఆడడమే కాదు కుర్రాళ్లకు దీటుగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అది కూడా అనారోగ్యంతో బాధపడుతూ వీపుపై ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి వికెట్ కీపింగ్ చేస్తుండడం గమనార్హం.

Viral: క్రికెట్ అంటే ఈ తాతకు ఎంత పిచ్చో.. 83 ఏళ్ల వయసులో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి వికెట్ కిపింగ్

క్రికెట్. ఈ ఆటపై చిన్న నుంచి పెద్ద వరకు ఉండే అభిమానాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. పాల బుగ్గల పసి పిల్లల నుంచి చర్మం ముడతలు పడిన ముసలి వాళ్ల వరకు క్రికెట్‌ను విపరీతంగా ఆరాధించేవారు చాలా మందే ఉంటారు. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. సరిగ్గా కళ్లు కనపడని వృద్ధులు సైతం చాలా మంది క్రికెట్ మ్యాచ్‌లను వీక్షిస్తారంటే ఈ ఆటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మనం వృద్ధులు క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించడమే చూశాం. కానీ ఓ 83 ఏళ్ల వృద్ధుడు ఏకంగా మైదానంలోకి దిగి క్రికట్ మ్యాచే ఆడేస్తున్నాడు. ఆడడమే కాదు కుర్రాళ్లకు దీటుగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అది కూడా అనారోగ్యంతో బాధపడుతూ వీపుపై ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి వికెట్ కీపింగ్ చేస్తుండడం గమనార్హం. దీనిని బట్టే ఆ తాతకు క్రికెట్‌ అంటే ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అది సాధారణ మ్యాచ్ కూడా కాదు. ఓ క్లబ్ మ్యాచ్. ఆ ఆటగాడు ఎవరో కాదు స్కాట్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ అలెక్స్ స్టీల్. అలెక్స్ స్టీల్ వికెట్ కీపింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియలో అప్‌లోడ్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోకు ‘‘స్టీల్‌కు ఆక్సిజన్ సిలిండర్లు నిజమైన ఆక్సిజన్ కాదని, క్రికెట్ అతనికి నిజమైన ఆక్సిజన్ అని మేము భావిస్తున్నాము’’ అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 83 ఏళ్ల అలెక్స్ స్టీల్ ఓ స్థానిక క్లబ్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను వీపుపై ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి వికెట్ కీపింగ్ చేయడం గమనార్హం. కాగా అలెక్స్ స్టీల్ 2020లో ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతను నిత్యం ఆక్సిజన్ సపోర్టుతోనే జీవనం సాగిస్తున్నాడు. అంతేకాకుండా ఈ వ్యాధి బారిన పడిన వారు 3 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి ఊపిరితిత్తులను క్రమంగా చిన్నవిగా మారుస్తుంది. ఎందుకంటే మచ్చ కణజాలం అల్వియోలీ (గాలి సంచులు) ఆక్సిజన్‌ను రక్తంలోకి బదిలీ చేయకుండా బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. మచ్చ కణజాలం పెరిగేకొద్దీ, ఊపిరితిత్తులు పని చేయడం తగ్గిపోతుంది. ఫలితంగా ఊపిరి ఆడదు. ఈ వ్యాధిలో చాలా మంది రోగులు చివరికి శ్వాసకోశ వైఫల్యంతో మరణిస్తారు.

కాగా స్కాట్లాండ్‌కు చెందిన అలెక్స్ స్టీల్ 1967లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో లాంక్షైర్‌తో జరిగిన ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్ తరపున అరంగేట్రం చేశాడు. స్టీల్ క్లబ్ క్రికెట్‌లో ఫోర్‌ఫర్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. 1960లలో స్కాట్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన స్టీల్ 28 సగటుతో 621 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. 1968లో ఐర్లాండ్‌పై సాధించిన 97 పరుగులు అతని కెరీర్ బెస్ట్ స్కోర్. ఇక వికెట్ కీపర్‌గా స్టీల్ 11 క్యాచ్‌లను అందుకోవడంతోపాటు రెండు స్టంపౌట్‌లు కూడా చేశాడు.

Updated Date - 2023-08-06T14:52:52+05:30 IST