IND vs PAK: సచిన్, పాకిస్థాన్ లెజెండ్ రికార్డులను సమం చేసిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులివే!

ABN , First Publish Date - 2023-09-10T17:53:58+05:30 IST

ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన హిట్‌మ్యాన్ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

IND vs PAK: సచిన్, పాకిస్థాన్ లెజెండ్ రికార్డులను సమం చేసిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులివే!

కొలంబో: ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన హిట్‌మ్యాన్ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు హాఫ్ సెంచరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభంలో హిట్‌మ్యాన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక దుమ్ములేపాడు. తన స్కోర్‌ను సిక్సుతో ప్రారంభించిన రోహిత్ ఆ వెంటనే ఓ ఫోర్ కూడా కొట్టాడు. ఆ తర్వాత కాస్త నిదానంగా ఆడాడు. మరోవైపు గిల్ మాత్రం ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. గిల్ ధాటిగా ఆడుతుంటే రోహిత్ స్ట్రైక్ రోటేట్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే గిల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గిల్ హాఫ్ సెంచరీ అనంతరం రోహిత్ గేర్ మార్చాడు. షాదాబ్ ఖాన్ వేసిన అదే ఓవర్‌లో వరుసగా రెండు సిక్సులు, ఒక ఫోర్ బాదాడు. షాదాబ్ వేసిన 15వ ఓవర్ మొదటి రెండు బంతులను సిక్సు, ఫోర్ బాదాడు. ఈ క్రమంలో 5 ఫోర్లు, 4 సిక్సులతో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఒకానొక దశలో 24 బంతుల్లో 10 పరుగులే చేసిన రోహిత్ ఆ తర్వాత మరో 18 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 4 సిక్సులతో 114 స్ట్రైక్‌‌రేట్‌తో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 4 రికార్డులను కూడా అందుకున్నాడు. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిదీ రికార్డులను హిట్‌మ్యాన్ సమం చేశాడు.


1. ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో 50వది. దీంతో వన్డే క్రికెట్‌లో 50 హాఫ్ సెంచరీలు చేసిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ కంటే ముందు సచిన్(96), కోహ్లీ(65), ద్రావిడ్(83), గంగూలీ(72), ధోని(73) ఈ ఘనత సాధించారు.

2. ఈ మ్యాచ్‌లో సాధించిన హాఫ్ సెంచరీ ఆసియాకప్‌లో రోహిత్‌కు 9వది. దీంతో ఆసియాకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌తో కలిసి హిట్‌మ్యాన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

3. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 4 సిక్సులు కొట్టాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడు పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిదీతో కలిసి సమంగా నిలిచాడు. వీరిద్దరు ఆసియా కప్‌లో 26 సిక్సుల చొప్పున కొట్టారు. కాగా త్వరలోనే మరొక సిక్సు కొట్టి అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచే అవకాశాలున్నాయి.

4. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మ 300 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్(346), వీరేంద్ర సెహ్వాగ్(321) ఉన్నారు.

Updated Date - 2023-09-10T17:53:58+05:30 IST