Asian Games 2023: సెంచరీతో జైస్వాల్ విధ్వంసం.. నేపాల్ ముందు భారీ టార్గెట్!

ABN , First Publish Date - 2023-10-03T09:02:26+05:30 IST

యశస్వి జైస్వాల్(100) సెంచరీతో పెను విధ్వంసం సృష్టించడంతో నేపాల్ ముందు టీమిండియా 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్లో రింకూ సింగ్(37) బ్యాటు ఘుళిపించడంతో టీమిండియా స్కోర్ 200 దాటింది.

Asian Games 2023: సెంచరీతో జైస్వాల్ విధ్వంసం.. నేపాల్ ముందు భారీ టార్గెట్!

చైనా: యశస్వి జైస్వాల్(100) సెంచరీతో పెను విధ్వంసం సృష్టించడంతో నేపాల్ ముందు టీమిండియా 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్లో రింకూ సింగ్(37) బ్యాటు ఘుళిపించడంతో టీమిండియా స్కోర్ 200 దాటింది. ఏషియన్ గేమ్స్ 2023 క్వార్టర్ ఫైనల్ 1లో భాగంగా భారత్, నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. యశస్వి జైస్వాల్ అయితే ఆరంభం నుంచే భారీ షాట్లతో రెచ్చిపోయాడు. వరుసగా ఫోర్లు, సిక్సులు బాదుతూ నేపాల్ బౌలర్లను అల్లాడించాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ధాటిగా ఆడుతుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతనికి సహకరించాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు 10 రన్ రేటుకు తగ్గకుండా దూసుకుపోయింది. ఈ క్రమంలో పవర్ ప్లేలోనే 63 పరుగులు వచ్చాయి. వీరి భాగస్వామ్యం 9.1 ఓవర్లలోనే 100కు చేరుకుంది. అయితే 10వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని దీపేంద్ర సింగ్ విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్ గైక్వాడ్(25) రోహిత్ పౌడేల్‌కు దొరికిపోయాడు. దీంతో 104 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ(2), జితేష్ శర్మ(5) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.


అయితే తన దూకుడును కొనసాగించిన యశస్వి జైస్వాల్ 8 ఫోర్లు, 7 సిక్సులతో 48 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే దీపేంద్ర సింగ్ వేసిన 17వ ఓవర్లో ఔటయ్యాడు. జైస్వాల్ ఔట్ అనంతరం టీమిండియా స్కోర్ బోర్డులో వేగం తగ్గింది. దీంతో 200 పరుగుల మార్కు చేరుకోవడం కష్టమే అనిపించింది. కానీ అభినాష్ బోహ్రా వేసిన చివరి ఓవర్లో రింకూ సింగ్ రెచ్చిపోయాడు. 2 సిక్సులు, 2 ఫోర్లతో 25 పరుగులు రాబట్టాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి 2 ఓవర్లలోనే టీమిండియాకు 39 పరుగులొచ్చాయి. 2 ఫోర్లు, 4 సిక్సులతో 15 బంతుల్లోనే 37 పరుగులు చేసిన రింకూ సింగ్, 2 ఫోర్లు, ఒక సిక్సుతో 19 బంతుల్లోనే 25 పరుగులు చేసిన శివమ్ దూబే నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 22 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 2, సోంపాల్ కమీ, లామిచ్ఛనే తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-10-03T09:03:25+05:30 IST