IND vs AUS 2nd ODI: సెంచరీలతో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా టీమిండియా!

ABN , First Publish Date - 2023-09-24T17:01:27+05:30 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(105), శుభ్‌మన్ గిల్(104) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన వీరిద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశారు.

IND vs AUS 2nd ODI: సెంచరీలతో శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా టీమిండియా!

ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్(105), శుభ్‌మన్ గిల్(104) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన వీరిద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశారు. గాయం నుంచి ఈ మధ్యనే కోలుకున్న శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు ఇది శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్న గిల్ మరో సారి తన బ్యాట్ నుంచి పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సైతం నెలకొల్పారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగా కోల్పోయింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో 8 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 16 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. అయితే ఈ ఆనందం కంగారులకు ఎంతో సేపు నిలవలేదు. అనంతరం జత కట్టిన మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఫోర్లు, సిక్సులతో టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే జట్టు స్కోర్ 9.5 ఓవర్లలో 79 పరుగుల వద్ద ఉండగా వర్షం కాసేపు అడ్డుపడింది. వర్షం తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో గిల్, శ్రేయస్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. దీంతో టీమిండియా స్కోర్ 8 రన్ ‌రేటుకు తగ్గకుండా పరుగులు పెట్టింది. పవర్ ప్లేలోనే భారత జట్టు 80 పరుగులు చేసింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ గిల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అది కూడా గ్రీన్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతికి సిక్సు కొట్టి హాఫ్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. కాగా గత మ్యాచ్‌లో కూడా గిల్ సిక్సు కొట్టి 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడం గమనార్హం. అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

హాఫ్ సెంచరీల అనంతరం గిల్, శ్రేయస్ మరింత రెచ్చిపోయారు. ధాటిగా బ్యాటింగ్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య భాగస్వామ్యం కూడా సునాయసంగా 100 పరుగులు దాటింది. శ్రేయస్, గిల్‌ను ఆపడానికి ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 158కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆడమ్ జంపా వేసిన 30వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఫోర్లు, 3 సిక్సులతో 86 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇది 3వ సెంచరీ. కాగా గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో గిల్, శ్రేయస్ మధ్య 200 పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తైంది. అయితే ఈ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు 31వ ఓవర్లో పేసర్ సీన్ అబాట్ విడదీశాడు. ఆ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయస్ బౌండరీ లైన్ వద్ద ఉన్న మాథ్యూ షార్ట్‌కు దొరికిపోయాడు. దీంతో 216 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మొత్తంగా 90 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 11 ఫోర్లు, 3 సిక్సులతో 105 పరుగులు చేశాడు. దీంతో 163 బంతుల్లోనే 200 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అనంతరం 6 ఫోర్లు, 4 సిక్సులతో శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గిల్‌కు ఇది ఆరో సెంచరీ కాగా.. ఈ సంవత్సరమే ఐదో సెంచరీ కావడం విశేషం. అయితే గిల్ కూడా సెంచరీ చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. గ్రీన్ వేసిన 35వ ఓవర్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 243 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.

Updated Date - 2023-09-24T17:06:48+05:30 IST