Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతను కలిసిన సౌరవ్ గంగూలీ

ABN , First Publish Date - 2023-01-16T21:14:24+05:30 IST

టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)ని కలిశాడు

Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతను కలిసిన సౌరవ్ గంగూలీ

కోల్‌కతా: టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)ని కలిశాడు. నగరంలోని నాబన్నాలో ఉన్న ఆమె కార్యాలయానికి వెళ్లిన గంగూలీ ఆమెతో భేటీ అయ్యాడు. 15 నిమిషాలపాటు వారిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే, వారేం మాట్లాడుకున్నారు? సమావేశం ఉద్దేశం ఏమిటన్న వివరాలు బయటకు రాలేదు.

అయితే, మమత పిలుపు మేరకు గంగూలీ వెళ్లి ఆమెను కలిసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలుసుకోవడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి. గంగూలీ 49వ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు జులై 2021లో మమత స్వయంగా క్రికెటర్ ఇంటికి వెళ్లారు. గతేడాది మేలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)కు గంగూలీ తన నివాసంలో విందు ఇచ్చారు. దీంతో గంగూలీ రాజకీయాల్లో చేరబోతున్నాడన్న వార్తలు హోరెత్తాయి. అయితే, ఈ వార్తలను గంగూలీ ఖండించాడు. అమిత్ షా తనయుడు జై షాతో తాను 2008 నుంచి కలిసి పనిచేస్తున్నానని, దీంతో అమిత్ షా కూడా తనకు తెలుసని అన్నాడు.

అమిత్ షాను కలిసిన తర్వాత.. మమతతో మీకేమైనా భేదాభ్రిప్రాయాలు ఉన్నాయా? అన్న విలేకరుల ప్రశ్నకు గంగూలీ బదులిస్తూ మమత తనకు చాలా సన్నిహితురాలని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ బాస్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ‘తాను కొత్త జీవితం’లోకి అడుగుపెట్టబోతున్నట్టు ట్వీట్ చేయడం ద్వారా గంగూలీ మరోసారి చర్చకు తెరలేపాడు. ఈ ట్వీట్ చూసిన వారు గంగూలీ రాజకీయాల్లోకి రావడం పక్కా అని తేల్చేశారు. అయితే, అలాంటిదేమీ లేదని, తాను ఎడ్యుకేషన్ యాప్ ప్రారంభిస్తున్నట్టు చెబుతూ అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోమారు మమతను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2023-01-16T21:21:23+05:30 IST