Share News

IND vs NED: వరల్డ్‌కప్‌లో ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసిన భారత్.. టాప్-5 ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం

ABN , First Publish Date - 2023-11-12T19:58:47+05:30 IST

Team India: ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో మొదటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వరుస విజయాలు నమోదు చేసిన భారత జట్టు.. తాజాగా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది. ఆదివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ ఘనత సాధించింది.

IND vs NED: వరల్డ్‌కప్‌లో ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసిన భారత్.. టాప్-5 ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం

ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో మొదటి నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వరుస విజయాలు నమోదు చేసిన భారత జట్టు.. తాజాగా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది. ఆదివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ ఘనత సాధించింది. టాప్-5 ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చడమే అందుకు కారణం. ఓపెనర్ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఐదో బ్యాటర్ కేఎల్ రాహుల్ దాకా.. ప్రతిఒక్కరూ 50కి పైగా వ్యక్తిగత పరుగులు చేశారు. టీమిండియాలోని టాప్-5 బ్యాటర్లు 50కి పైగా స్కోర్‌లు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ విషయంలోనే భారత ఆల్‌టైం రికార్డ్‌ని తన పేరిట లిఖించుకుంది.


తొలుత ఓపెనర్లుగా రంగంలోకి దిగిన రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51).. ఎప్పట్లాగే భారత జట్టుని శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఆడి.. చెరో అర్థశతకం చేశారు. తొలి వికెట్‌కి వీళ్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ వెనువెంటనే ఔట్ అయ్యారు. 100 పరుగుల వద్ద శుభ్‌మన్ ఔట్ అవ్వగా.. 129 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. గిల్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సైతం (51) అర్థశతకంతో సత్తా చాటాడు. నిజానికి.. కోహ్లీ క్రీజులో కుదురుకోవడం చూసి, అతడు సెంచరీ చేయడం ఖాయమని, దీంతో వన్డేల్లో 50 సెంచరీల రికార్డ్ నమోదు చేస్తాడని అనుకున్నారు. కానీ.. కోహ్లీ అనూహ్యంగా వాండర్ మర్వ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

ఇక శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అయితే.. నెదర్లాండ్స్ బౌలర్లపై దండయాత్ర చేశారు. వీళ్లిద్దరూ క్రీజులో చివరివరకూ నిల్చొని.. పరుగుల వర్షం కురిపించారు. భారీ షాట్లతో టీమిండియా ఫ్యాన్స్‌కి మాంచి ట్రీట్ ఇచ్చారు. వీళ్లు ఆడుతున్నంతసేపు మైదానంలో ఒకటే అరుపులు. క్లిష్టమైన బంతుల్ని సైతం అనుకూలంగా మార్చుకొని, బౌండరీలు బాదేశారు. నాలుగో వికెట్‌కి 208 పరుగుల భాగస్వామ్యం జోడించారంటే.. ఎలా కుమ్మేశారో మీరే అర్థం చేసుకోండి. ఇలా టాప్-5 బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చి.. ఇండియా పేరిట ఆల్‌టైమ్ రికార్డ్ తెచ్చిపెట్టారు. దీంతోపాటు వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కూడా!

Updated Date - 2023-11-12T19:58:49+05:30 IST