Share News

IND vs SA: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. డబ్ల్యూటీసీ చరిత్రలో..

ABN , Publish Date - Dec 27 , 2023 | 10:36 AM

Virat Kohli: సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు.

IND vs SA: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. డబ్ల్యూటీసీ చరిత్రలో..

సెంచూరియన్: సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో 2097 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కింగ్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 2101 పరుగులున్నాయి. రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్‌ల్లో 2097 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 57 ఇన్నింగ్స్‌ల్లో 2101 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ పేరు మీద ఉంది. రూట్ 3,987 పరుగులు చేశాడు. 3,641 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో, 3,223 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. ముఖ్యంగా కగిసో రబాడ (5/44) విజృంభణకు భారత బ్యాటర్లు దాసోహమయ్యారు. అతడి బౌన్స్‌, స్వింగ్‌ బంతులకు రోహిత్‌ (5), శ్రేయాస్‌ (31), విరాట్‌ కోహ్లీ (38), అశ్విన్‌ (8), శార్దూల్‌ (24) పెవిలియన్‌ చేరడం భారత్‌ను దెబ్బతీసింది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు ఆడిన కేఎల్‌ రాహుల్‌ (105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 బ్యాటింగ్‌) మాత్రం తన కళాత్మక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలిచాడు. అతడి పోరాటం కారణంగా తొలి రోజు మంగళవారం భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. అయితే ఆఖరి సెషన్‌ ఆరంభమైన కాసేపటికే వర్షం కురవడంతో ఆటను రద్దు చేశారు. తొలి రోజు 31 ఓవర్ల ఆట కోల్పోయినందున బుధవారం మధ్యాహ్నం అరగంట ముందుగా... ఒంటి గంటకే మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌తో పాటు సిరాజ్‌ (0) ఉన్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ అరంగేట్రం చేశాడు.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 10:36 AM